Share News

స్థాయి మారినా.. అవే వెతలు!

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:03 PM

పాలకొండ నగర పంచాయతీ స్థాయి మారినా.. ఇంకా పాత సమస్యలే ప్రజలను వేధిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు.

 స్థాయి మారినా.. అవే వెతలు!
నగర పంచాయతీ కార్యాలయం

నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయి 13 ఏళ్లు

అయినా పాలకొండలో మారని పరిస్థితి

వేధిస్తున్న తాగునీరు, పారిశుఽధ్యం, డంపింగ్‌యార్డు సమస్యలు

నేటితో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం

17నుంచి ప్రత్యేకాధికారి పాలన

పాలకొండ, మార్చి15(ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీ స్థాయి మారినా.. ఇంకా పాత సమస్యలే ప్రజలను వేధిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. సౌకర్యాలు సమకూరడం లేదు. పట్టణవాసులకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ పారిశుఽధ్యం, తాగునీరు, డంపింగ్‌యార్డు సమస్యలు పరిష్కారానికి నోచు కోవడం లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవంగా 2013, మార్చి 21న మేజర్‌ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా పాలకొండ అప్‌ గ్రేడ్‌ అయింది. ఇప్పటికీ రెండు పాలక వర్గాలు పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులేవీ జరగలేదు. పన్నులు భారమైతే అధికమైంది తప్ప పాలనాపరంగా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఈ నెల 16తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. 17 నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో పట్టణవాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నగర పంచాయతీలో సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కార మార్గం చూపాలని వారు కోరుతున్నారు.

వీడని డంపింగ్‌యార్డు సమస్య...

నగర పంచాయతీలో డంపింగ్‌యార్డు సమస్య కొలిక్కి రాలేదు. 2015లో అప్పటి పాలకవర్గం సిరికొండ సమీపంలో స్థలం గుర్తించి శంకుస్థాపన చేశారు. అయితే నాటి నుంచి నాలుగు చోట్ల స్థల సేకరణ చేపడుతున్నప్పటికీ శాశ్వత ప్రాతిపదికన డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయలేక పోతున్నారు. వాస్తవంగా రోజూ 16 టన్నుల చెత్తను నగర పంచాయతీ సిబ్బంది సేకరిస్తుంటారు ఆ వ్యర్థాలను ప్రస్తుతం ఓని ప్రధాన రహదారికి అనుకొని ఉన్న ఓ చెరువులో డంపింగ్‌ చేస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న జగనన్న కాలనీవాసులతో పాటు ఓని, లుంబూరు తదితర గ్రామాల ప్రజలు దుర్వాసనతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతున్నారు.

తీరని తాగునీటి కష్టాలు...

నగర పంచాయతీ పరిధిలో నాలుగు రక్షిత నీటి పథకాలు ఉన్నా వేసవి వచ్చిందంటే ప్రజలు తాగునీటికి కష్టాలు తప్పడం లేదు. 2018లో కేంద్ర ప్రభుత్వం నాన్‌ అమృత్‌ పథకం కింద రూ.58 కోటు మంజూరు చేసినా వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో పనులు జరగలేదు. దీంతో ఎన్‌కే రాజపురం, గాయ త్రీనగర్‌, గారమ్మకాలనీ, ఇందిరానగర్‌ కాలనీ తదితర శివారు ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు. ఇదిలా ఉండగా.. ఎన్నో ఏళ్ల కిందట వేసిన పైపులైన్లు మురుగు కాలువల్లో ఉండడంతో తాగునీరు లీకై కలుషితమవుతుంది. దీతో తరచూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

మెరుగుపడని పారిశుధ్యం..

నగర పంచాయతీలో ప్రస్తుతం సుమారు 42 వేల మంది జనాభా ఉన్నారు. 20 వార్డులు ఉన్నాయి. 175 వరకు వీధులు ఉన్నాయి. అయితే ఆయా వీధుల్లో సరైన మురుగకాలువలు లేవు. దీంతో ఎక్కడికక్కడే మురుగు నిలిచి పోతుంది. కాలువల్లో పూడుకుపోయిన వ్యర్థాలను తొలగించకపోవడంతో పలు చోట్ల రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తుంది. మరోవైపు చెత్తాచెదారాలను సకాలంలో డంపింగ్‌ యార్డుకు తరలిం చడం లేదు. దీంతో పట్టణ పరిధిలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తుండగా.. పట్టణ వాసులకు దోమల బెడద తప్పడం లేదు. మురుగు కాలువల నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదు.

కానరాని ఆహ్లాదం...

పాలకొండలో ఉన్న చెరువులన్నీ అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్నాయి. కొన్నాళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం పట్టణంలో వెంకటరాయుని కోనేరు, కల్యాణి చెరువుల అభివృద్ధికి రూ.75 లక్షలు మం జూరు చేసింది. అయితే నాటి వైసీపీ ప్రభుత్వం నిధుల వినియోగంలో తాత్సారం చేసింది. దీంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం ఎండమావిగానే మిగిలింది. ఇటీవల వెంకటరాయుని కోనేరును సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ పరిశీలించారు. దాని అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అమలుకాని ప్లాస్టిక్‌ నిషేధం...

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌, పాలిథిన్‌ నిషేధం పాలకొండలో మాత్రం మచ్చుకైనా అమలు కావడం లేదు. వ్యాపారులు విచ్చలవిడిగా పాలిథిన్‌ను విక్రయిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో పట్టణం సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వ్యర్థాలతో అధ్వానంగా మారుతోంది.

వీడని అవినీతి మరక...

నగర పంచాయతీకి అప్‌గ్రేడ్‌ అయిన తర్వాత 13 ఏళ్లలో 18 మంది కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. వారిలో నలుగురు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మరో ఐదుగురు నెలల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. మొత్తంగా కమిషనర్‌ స్థాయి అధికారులు ఎక్కువ కాలం పనిచేయ కపోవడంతో పట్టణం అభివృద్ధికి నోచుకోలేకపోయింది.

పక్కా ప్రణాళికతో అభివృద్ధి..

పక్కా ప్రణాళికతో నగర పంచాయతీని అభివృద్ధి చేస్తాం. డంపింగ్‌యార్డు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతాం. నగర పంచాయతీపై సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. తరచూ వార్డుల్లో పర్యటిస్తూ పలు సూచనలు అందిస్తున్నారు.

-రత్నరాజు, కమిషనర్‌, పాలకొండ నగర పంచాయతీ

Updated Date - Mar 15 , 2026 | 11:03 PM