Even After Price Reduction..! ధర తగ్గించినా..!
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:47 PM
Even After Price Reduction..! జిల్లాలో పలుచోట్ల మద్యం అమ్మకాలపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఎంఆర్‌పీకి మించి విక్రయాలు చేపడుతున్నారు. అయినా స్పందించేవారే కరువయ్యారు. ప్రభుత్వం కొన్ని మద్యం బ్రాండ్లకు ధరలు తగ్గించినా.. ఫలితం లేకుండా పోతోంది. పాత ఎంఆర్‌పీకే విక్రయాలు జరిపి కొంతమంది వ్యాపారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు.
వ్యాపారులకు కాసుల పంట.. పట్టించుకోని అధికారులు
పార్వతీపురం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల మద్యం అమ్మకాలపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఎంఆర్‌పీకి మించి విక్రయాలు చేపడుతున్నారు. అయినా స్పందించేవారే కరువయ్యారు. ప్రభుత్వం కొన్ని మద్యం బ్రాండ్లకు ధరలు తగ్గించినా.. ఫలితం లేకుండా పోతోంది. పాత ఎంఆర్‌పీకే విక్రయాలు జరిపి కొంతమంది వ్యాపారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. 750 ఎంఎల్ బ్రాండ్ మద్యం సీసా రూ.590కు, 180 ఎంఎల్ బాటిల్‌ను రూ. 170 విక్రయించేవారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో వాటి ధరలు తక్కువగా ఉండడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఆ బ్రాండ్ మద్యం ధరలు తగ్గించింది. ఈ మేరకు 750 ఎంఎల్ మద్యం సీసా ధర రూ.560, 180 ఎంఎల్ బాటిల్ ధర రూ. 160కు విక్రయించాలని కొద్దిరోజుల కిందట ఆదేశాలిచ్చింది. తగ్గించిన ధరల ప్రాప్తికి జిల్లాలో విక్రయాలు జరగడం లేదు. దీనిపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం దోపిడీ అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. ఈ అంశంపై ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖాధికారి శ్రీనాథుడును వివరణ కోరగా.. ‘ప్రభుత్వం తగ్గించిన ధరల ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలి. ఎక్కడైనా పాత ఎంఆర్‌పీకి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. తగ్గించిన ఎంఆర్‌పీ లేబుల్‌తోనే సదరు బ్రాండ్ మద్యం సరఫరా అవుతుంది. పాత ధరలకు విక్రయాలు జరుగుతున్నట్టు మా దృష్టికి రాలేదు. అయినప్పటికీ దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి.. బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.