Share News

Even After 24 Hours… 24 గంటలు గడిచినా..

ABN , Publish Date - May 03 , 2026 | 12:11 AM

Even After 24 Hours… జిల్లావ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు 51 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల సర్వీస్‌వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా చెట్టుకొమ్మలు, హోర్డింగ్‌లు విద్యుత్‌ వైర్లుపై తెగిపడ్డాయి. దీంతో పలు మండలాల్లోని గ్రామాలు 24 గంటలు గడిచినా ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి.

Even After 24 Hours… 24 గంటలు గడిచినా..
పాలకొండ పట్టణంలో పనులు చేస్తున్న సిబ్బంది

  • జిల్లాలో 51 విద్యుత్‌ స్తంభాలు నేలమట్టం

  • దెబ్బతిన్న సర్వీస్‌ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు..

పాలకొండ, మే2(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు 51 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల సర్వీస్‌వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా చెట్టుకొమ్మలు, హోర్డింగ్‌లు విద్యుత్‌ వైర్లుపై తెగిపడ్డాయి. దీంతో పలు మండలాల్లోని గ్రామాలు 24 గంటలు గడిచినా ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఒక్క పాలకొండ మండలంలోనే ఎం.సింగుపురం, డోలమడ మధ్య 12 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్‌శాఖ యంత్రాంగం నిరంతరాయంగా విధుల్లో నిమగ్నమై విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే పనిలో పడ్డారు. అయినప్పటికీ ఇప్పటికీ పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ జరగలేదు. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో శనివారం పట్టణంలోని 20 వార్డుల్లో సగానికి పైగా తాగునీరు సరఫరా కాలేదు. ఆదివారం కూడా కొన్ని ప్రాంతాలకు కుళాయిల ద్వారా తాగునీరు వచ్చే అవకాశం లేదని తెలిసింది. మరోవైపు విద్యుత్‌శాఖాధికారులు ఎంత నష్టం వాటిల్లిందన్న దానిపై అంచనా వేస్తున్నారు.

తొండ కారణంగా నిలిచిన విద్యుత్‌ సరఫరా

పట్టంణంలోని పాలకొండ-రాజాం ప్రధాన రహదారిలో ఉమారామలింగేశ్వరాలయం వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా పలు వీధులకు విద్యుత్‌ సరఫరా అవుతుంది. శుక్రవారం సాయం త్రం ఈదురుగాలులు ప్రభావంతో అన్ని ప్రాంతాల మాదిరిగానే పాలకొండ-రాజాం రహదారితో పాటు వెంకటేశ్వరకాలనీ తదితర ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో సాంకేతిక సమస్య తలెత్తిందని అంతా భావించారు. విద్యుత్‌శాఖ సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించగా తొండ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడడంతో షాక్‌కు గురై మృతి చెందింది. దీంతో ఫీజులు దెబ్బతిని ఆ ప్రాంతమంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీనిని గమనించి సిబ్బంది ఫీజును సరిచేశారు. అయితే తొండ ఎంత పని చేసిందోనని విద్యుత్‌ సిబ్బంది, ప్రజలు చర్చించడం కనిపించింది.

Updated Date - May 03 , 2026 | 12:11 AM