Even After 15 Days 15 రోజులు దాటినా.. ఇంకా అందలే!
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:51 PM
Even After 15 Days, Still Not Received! జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో పాలు సరఫరా కావడం లేదు. ఈ నెలలో 15 రోజులు గడిచిపోయినా.. ఇంకా పలు ప్రాంతాల్లో వాటిని అందించలేదు.
ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
పార్వతీపురం, జూన్ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో పాలు సరఫరా కావడం లేదు. ఈ నెలలో 15 రోజులు గడిచిపోయినా.. ఇంకా పలు ప్రాంతాల్లో వాటిని అందించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రుపాయలు ఖర్చుచేసి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం అందిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో నెలకొన్న భిన్న పరిస్థితుల కారణంగా లక్ష్యం దెబ్బతింటోంది. ప్రధానంగా కాంట్రాక్టర్లు ఒక్కో నెల ఒక్కోలా పాలు పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రతినెలా రెండు విడతల్లో పాలు ఇవ్వాల్సి ఉండగా.. అనేక కేంద్రాల్లో ఒకసారే ఇస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు నెలకు ఐదు లీటర్ల చొప్పున, ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు ఆరు లీటర్ల పాలు అందించాల్సి ఉంది. ప్రీస్కూల్ పిల్లలకు రోజూ 200 మిల్లీమీటర్ల పాలను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఇవ్వాల్సి ఉంది. అయితే అలా కాకుండా ప్రతి నెల మొదటి, మూడో శుక్రవారాల్లో పాలు ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. కాగా ఇప్పటివరకు జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో పాలు సరఫరా కాలేదు.
జిల్లాలోని పది ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. పాలకొండ, సీతంపేట, భామిని, కురుపాం, భద్రగిరి, కొమరాడ, పాచిపెంట, సాలూరు, పార్వతీపురం, బలిజిపేట కేంద్రాల పరిధిలో మొత్తం 1425 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆయా చోట్ల గర్భిణులు 4,226 మంది , బాలింతలు 3,389 మంది , ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలు 20,272 మంది ఉన్నారు. వీరందరికీ క్రమం తప్పకుండా ప్రతినెలా పాలు అందించాల్సి ఉంది. కానీ వాటి సరఫరాలో జాప్యం జరుగుతుండడడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు 2,31,788 లీటర్ల పాలు అవసరం కాగా ఇప్పటివరకు పాచిపెంట, కురుపాం, సాలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 83,887 లీటర్ల మేర పాలు వచ్చాయి. మిగిలిన పాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై ఐసీడీఎస్ పీడీ కనకదుర్గను వివరణ కోరగా.. ‘పాలు సరఫరాలో జాప్యం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు చేరుకుంటాయి. నిబంధనల ప్రకారం లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తాం. ’ అని తెలిపారు.