పారమ్మకొండపై అఖండ జ్యోతి
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:53 PM
Eternal Flame on Parammakonda Hill జిల్లాలో కార్తీక సందడి నెలకొంది. అంతటా శివనామస్మరణ మార్మోగింది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మన్యంవాసులు మంగళవారం కార్తీక పౌర్ణమిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామునే నదీ స్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. అనంతరం శివాలయాలకు చేరుకున్నారు.
కొండపైనే రాత్రి బస
పాచిపెంట రూరల్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కార్తీక సందడి నెలకొంది. అంతటా శివనామస్మరణ మార్మోగింది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మన్యంవాసులు మంగళవారం కార్తీక పౌర్ణమిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామునే నదీ స్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. అనంతరం శివాలయాలకు చేరుకున్నారు. ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మరోవైపు మహిళలు ఉదయం నుంచి ఉపవాస దీక్షలు చేశారు. సాయంత్రం ఇళ్లలో ప్రత్యేక పూజలు, నోములు నోచారు. వివిధ రకాల పిండి వంటకాలతో పాటు బూరెలను నైవేథ్యంగా సమర్పించారు. అనంతరం ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు. ఇక జిల్లాలోని పలు శైవక్షేత్రాల్లో దీపోత్సవం, జ్వాలాతోరణం వంటి కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై వేడుకలను తిలకించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా పారమ్మకొండపైన పారమ్మతల్లికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృత్తికా (అఖండ జ్యోతి) దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన భక్తి కీర్తనలు అందర్నీ అలరించాయి. ఇదిలా ఉండగా.. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం పారమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆయన పారమ్మకొండ దిగువనున్న పారమ్మతల్లి పాదాలను దర్శించుకున్నారు. అనంతరం మెట్లు మార్గం గుండా కొండపైకి చేరుకొని పారమ్మతల్లిని దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు, కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా పారమ్మకొండపైకి వెళ్లిన కలెక్టర్ అక్కడే రాత్రి బస (ఆకాశ నిద్ర) చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.