AMCs (Agricultural Market Committees) ఏఎంసీల్లో ఈ-పర్మిట్ విధానం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:31 AM
E-Permit System Introduced in AMCs (Agricultural Market Committees) వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఏఎంసీల్లో రుసుం, ఇతర వసూళ్లను డిజిటల్ విధానంలో రాబట్టాలని ఆదేశించింది. వచ్చేనెల నుంచి ఈ-ట్రాన్స్‌పోర్టు పర్మిట్ల విధానాన్ని అమలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
డిజిటల్ పద్ధతిలో రుసుం వసూళ్లకు కసరత్తు
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
పార్వతీపురం టౌన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఏఎంసీల్లో రుసుం, ఇతర వసూళ్లను డిజిటల్ విధానంలో రాబట్టాలని ఆదేశించింది. వచ్చేనెల నుంచి ఈ-ట్రాన్స్‌పోర్టు పర్మిట్ల విధానాన్ని అమలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో వ్యాపారులు కొనుగోలు చేసే వ్యవసాయ ఉత్పత్తులు, పశువులు, గొర్రెలు తరలింపునకు జూలై నుంచి ఈ-ట్రాన్స్‌పోర్టు అనుమతులు తప్పకుండా అమలు చేయాల్సి ఉంది. దీంతో జిల్లాలోని మార్కెట్ కమిటీ కార్యాలయాల పరిధిలో సాంకేతిక పరంగా ఈ-ట్రాన్స్‌పోర్టు పర్మిట్లను ఎలా మంజూరు చేయాలనేదానిపై శాఖ అధికారుల పర్య వేక్షణలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు కసరత్తులు చేస్తున్నారు. ఇకపై మాన్యువల్ విధానానికి స్వస్తి పలికి.. ఈ-పర్మిట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
మార్గదర్శకాలు ఇవీ..
- ఏఎంసీల పరిధిలో కొనుగోలు చేస్యేవసాయ ఉత్పత్తులు . పశువులు, గొర్రెలు, మేకలు తరలించే ప్రతి వాహనానికీ తప్పనిసరిగా ఈ-ట్రాన్స్‌ఫోర్టు అనుమతి ఉండాలి.
- వ్యాపారులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా ఈ-ట్రాన్స్‌పోర్టు అనుమతి రూపొందించాలి. మార్కెట్ ఫీజును డిబెట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర ఎలక్ట్రికల్ మోడ్ ద్వారా సంబంధిత ఏఎంసీల ఖాతాలకు చెల్లించాలి.
- ఈ-ట్రాన్స్‌పోర్టు అనుమతిని మార్కెట్ ఫీజుగా ధ్రువీకరిస్తారు. అనుమతులిచ్చిన సరుకుల రవాణాకు మళ్లీ మార్కెట్ ఫీజు విధించరు.
- చెక్‌పోస్టుల వద్ద తనిఖీల్లో విఽధిగా అధికారులకు ఈ-ట్రాన్స్‌పోర్డు అనుమతి పత్రాన్ని వ్యాపారులు చూపించాలి.
- జూలై-1 నుంచి చెక్‌పోస్టులో ఉన్న ఫీజుల రశీదు పుస్తకాలను నిలిపివేయనున్నారు. లైసెన్స్ లేని వ్యాపారుల నుంచి ఫోన్ పే, క్యూ ఆర్ కోడ్ ద్వారా ఫీజులు వసూలు చేయడానికి ఈ ట్రాన్స్‌ఫోర్టు అనుమతి పత్రాన్ని అమలు చేయనున్నారు. ఈ పత్రం లేకుండా వ్యవసాయ ఉత్పత్తు, పశువులు, ఇతర జంతువులను రవాణా చేస్తే కాంపౌండింగ్ ఫీజు విధిస్తారు.
- గ్రామాల్లో లైసెన్స్ లేకుండా వ్యవసాయ, తదితర ఉత్పత్తులకు సంబంధించి వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా ఈ-ట్రాన్స్‌పోర్టు అనుమతి పరిఽధిలోకి తీసుకురావాలి. అ బాధ్యతను ఏఎంసీల అసిస్టెంట్ డైరెక్టర్లు, సెక్రటరీలకు అప్పగించారు.
- నూతన లైసెన్స్‌లను ఓఎల్‌ఎంఎస్( ఆన్‌లైన్ లైస్సెనింగ్‌మేనేజ్‌మెంట్ పద్ధతి) ద్వారా మాత్రమే మార్కెట్ కమిటీల కార్యదర్శులు జారీ చేయాల్సి ఉంటుంది.
- ఈనెల 30లోగా వ్యాపారుల వద్ద ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల రవాణా అనుమతుల పుస్తకాలను ఏఎంసీలకు అప్పగించాలి. చెక్‌పోస్టు సిబ్బందికి ఏఎంసీల ఫీజు రశీదులను జారీ చేయకూడదు.
- ఏఎంసీల పరిధిలో ఉన్న వ్యాపారుల లావాదేవీలతోపాటు ఇప్పటి వరకు మార్కెట్ ఫీజు చెల్లింపు రుజువులను ఈ-ట్రాన్స్‌పోర్టు అనుమతికి సంబంధించి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనిపై ఆ శాఖ జాయింట్, డిప్యూటీ డైరెక్టర్ల పర్యవేక్షణలో త్వరలో వ్యాపారులతో సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
వచ్చేనెల నుంచి అమలు
ప్రతి వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో వచ్చేనెల 1వ తేదీ నుంచి పక్కాగా ఈ-ట్రాన్స్‌పోర్టు అనుమతి విధానాన్ని అమలు చేయనున్నాం. వ్యవసాయ ఉత్పత్తులు, సంతల నుంచి రవాణా చేసే పశువులు, ఇతర జంతువులకు సంబంధించి వ్యాపారులు ఈ-ట్రాన్స్‌ఫోర్టు అనుమతులకు అనుగుణంగా నడుచుకోవాలి. దీనిపై త్వరలోనే వ్యాపారులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తాం.
- బి.శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ