Share News

BCs బీసీల్లో జోష్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:38 PM

Enthusiasm Among BCs కూటమి ప్రభుత్వం ‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉండడంతో ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ మీటింగ్‌ జరిగింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఎనిమిది కేటగిరీల్లో రిజర్వేషన్లను ఖరారు చేసింది. ముందుగా పట్టణ ఎన్నికలు జరగనుండగా.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కుదరదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 BCs బీసీల్లో జోష్‌

  • ఆనందం వ్యక్తం చేస్తున్న కూటమి నేతలు

  • మైదాన ప్రాంతాల్లోని బీసీ నేతల్లో చిగురిస్తున్న ఆశలు

  • స్థానిక ఎన్నికల్లో గెలిచి పదవులు పొందాలని యోచన

పార్వతీపురం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉండడంతో ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ మీటింగ్‌ జరిగింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఎనిమిది కేటగిరీల్లో రిజర్వేషన్లను ఖరారు చేసింది. ముందుగా పట్టణ ఎన్నికలు జరగనుండగా.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కుదరదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ జనాభాకు అనుగుణంగా రాజీవ్‌ రంజన్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్‌ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో సగటున 28.18 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవో 17ను జారీ చేసింది. చట్టపరమైన పరిమితుల వల్ల ఎక్కడైనా కోటా తగ్గితే.. కూటమి పక్షాలు తమ అభ్యర్థులకు ఏకంగా 34 శాతానికి తగ్గకుండా టికెట్లు ఇచ్చి రాజకీయంగా అండగా నిలుస్తామని ప్రకటించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా బీసీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

బీసీల రిజర్వేషన్లు ఇలా..

మున్సిపల్‌ చైర్మన్‌ లేదా చైర్‌ పర్సన్లకు సంబంధించి 33.02 శాతం, కౌన్సిలర్లకు 32.78 శాతం, జడ్పీటీసీ సభ్యులకు 24.60 శాతం, సర్పంచ్‌లకు 27.95, ఎంపీటీసీలకు 25.55 శాతం , ఎంపీపీలకు 24.60 శాతం, జడ్పీ చైర్మన్లకు 23.08 శాతం మేర రిజర్వేషన్లు కల్పించారు. దీంతో స్థానిక సంస్థల్లో పోటీచేయాలనుకుంటున్న బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నాయకుల్లో ఆనందం వ్యక్తమ వుతుంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకు లభిస్తుందని అత్యధికులు భావిస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో సుమారు 6.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1.98 లక్షల మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు 77,412 మంది, బీసీలు 3.49 లక్షల మంది , ఇతరులు 19,091 మంది ఓటర్లు ఉన్నారు.

జడ్పీటీసీ స్థానాలకు..

జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో గిరిజన ప్రాంతాలకు చెందిన స్థానాలు మినహా మిగిలిన మైదాన ప్రాంతాలకు చెందిన స్థానాలను టీడీపీ అధిష్ఠానం బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది టీడీపీ నేతలు జడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జడ్పీటీసీగా గెలిస్తే.. జడ్పీ చైర్మన్‌ పదవి పొందే అవకాశం ఉంటుందని చాలామంది యోచిస్తున్నారు. జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, పాచిపెంట, సాలూరు మండలాల్లో సీనియర్‌ టీడీపీ నాయకులు జడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలిస్తే.. తమకు జడ్పీ పీఠం వరించే అవకాశం లేకపోలేదని చాలామంది బీసీ నేతలు భావిస్తున్నారు.

ఎంపీటీసీలకు ఇలా..

జిల్లాలో బీసీలకు స్థానిక ఎన్నికల్లోనే పోటీ చేసే అవకాశం మాత్రమే ఉంది. శాసనసభకు పోటీ చేసే అర్హత ఉన్నా.. రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో అనేక మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు మండల స్థాయికే పరిమితమవుతున్నారు. అయితే బీసీల రిజర్వేషన్‌పై తాజాగా టీడీపీ అధిష్ఠానం నిర్ణయంతో జిల్లాలోని 15 మండలాల్లోని బీసీ నేతల్లో ఆశలు చిగురి స్తున్నాయి. ఎంపీటీసీలుగా ఎన్నికై ఎంపీపీ పదవులు పొందాలని భావిస్తున్నారు. ఏజెన్సీ మండలాల్లో మినహాయిస్తే.. మైదాన ప్రాంతాల్లోని ప్రతి ఎంపీపీ స్థానం కోసం బీసీ నాయకులు తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉంది.

సర్పంచ్‌ స్థానాలకు...

జిల్లాలో 451 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఏజెన్సీ పంచాయతీల మినహా మిగిలిన మైదాన ప్రాంత పంచాయతీలో బీసీలే అధికంగా సర్పంచ్‌లుగా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. కాగా బీసీలకు అత్యధిక స్థానాలు కేటాయించనున్నట్లు టీడీపీ అధిష్ఠానం ప్రకటించడంతో ఆశావహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు సర్పంచ్‌లుగా పోటీ చేసే అవకాశం లభిస్తుందని అనేక మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు, యువత భావిస్తున్నారు.

Updated Date - Oct 10 , 2026 | 11:38 PM