Share News

entertainment at Tatipudi.. తాటిపూడిలో విహారం.. వినోదం

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:32 PM

entertainment at Tatipudi.. చుట్టూ కొండలు.. మధ్యలో జలాశయం.. ఎటు చూసినా పచ్చని వాతావరణం.. ఆహ్లాద పరిసరాలు.. చెంతనే అందాల కాటేజీలు.. అందులో ప్రత్యేకమైనా ఆహార పదార్థాలు.. గిరిజన సంస్కృతిని ప్రతిబించేలా థింసా, మయూరి నృత్యాలు.. చలి నుంచి ఉపశమనం పొందడానికి రాత్రి వేళ క్యాంపు ఫైర్‌.. సాహస ప్రియుల కోసం అద్భుతమైన ట్రెక్కింగ్‌ పాత్‌.. ఇన్ని సౌకర్యాలున్న ఆ ప్రాంతం మన తాటిపూడే. తాజాగా పూర్వ శోభను అద్దుకుని సరికొత్తగా సిద్ధమైంది.

entertainment at Tatipudi..  తాటిపూడిలో   విహారం.. వినోదం
తాటిపూడిలో బోటు షికారు

తాటిపూడిలో

విహారం.. వినోదం

రిజర్వాయర్‌లో బోటు షికారు ప్రారంభం

ఆకట్టుకునే పరిసరాలు

పెరుగుతున్న సందర్శకులు

అందుబాటులో కాటేజీలు

చుట్టూ కొండలు.. మధ్యలో జలాశయం.. ఎటు చూసినా పచ్చని వాతావరణం.. ఆహ్లాద పరిసరాలు.. చెంతనే అందాల కాటేజీలు.. అందులో ప్రత్యేకమైనా ఆహార పదార్థాలు.. గిరిజన సంస్కృతిని ప్రతిబించేలా థింసా, మయూరి నృత్యాలు.. చలి నుంచి ఉపశమనం పొందడానికి రాత్రి వేళ క్యాంపు ఫైర్‌.. సాహస ప్రియుల కోసం అద్భుతమైన ట్రెక్కింగ్‌ పాత్‌.. ఇన్ని సౌకర్యాలున్న ఆ ప్రాంతం మన తాటిపూడే. తాజాగా పూర్వ శోభను అద్దుకుని సరికొత్తగా సిద్ధమైంది.

గంట్యాడ, జనవరి 1(ఆంరఽధజ్యోతి):

తాటిపూడికి పూర్వవైభవం వచ్చింది. రిజర్వాయర్‌లో బోటు షికారు మొదలవడంతో సందర్శకుల తాకిడి పెరుగుతోంది. రిజర్వాయర్‌ ఆవల అటవీ శాఖ అధ్వర్యంలో కాటేజీలను కూడా పునఃప్రారంభిస్తున్నారు. దీనివల్ల పర్యాటకులు మరింతగా రానున్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో తాటిపూడి ప్రత్యేకం. అది ప్రకృతి అందాలకు నిలయం. చుట్టూ కొండలు మధ్యలో ఉన్న నీటిలో బోటు షికారు చేయడం ఓ మంచి అనుభూతి.

ఈ ప్రాంతానికి జిల్లా వాసులే కాకుండా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ అందాలను తిలకించిన తరువాత బొర్రా, అరకు, చింతపల్లి వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ రిజర్వాయర్‌లో 2000 సంవత్సరంలోనే బోటు షికారు ప్రారంభించారు. ఎకో టూరిజంలో భాగంగా కాటేజీలు కూడా నిర్మించారు. కార్తీక మాసంతో పాటు సెలవుల సమయంలో సందర్శకులు అధికంగా వచ్చేవారు. 2018లో కృష్టానదిలో జరిగిన బోటు ప్రమాదంతో ఇక్కడ బోటు షికారును నిలిపివేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి లేకపోయింది. ఇటువైపు సందర్శకులు రావడం దాదాపు మానేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కొద్దిరోజుల క్రితం బోటు షికారు ప్రారంభించారు. అప్పటి నుంచి సందర్శకుల తాకిడి మొదలైంది. ముఖ్యమైన రోజుల్లో వందలాది మంది సందర్శకులు వచ్చి ప్రకృతి అందాలను తిలకిస్తున్నారు.

సౌకర్యాలు ఎన్నో..

తాటిపూడి రిజర్వాయర్‌ ఆవల గిరి వినాయక కాటేజీలు కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయి. పది కాటేజీలు పచ్చని కొండల్లో నిర్మించారు. చుట్టూ చెట్లు, ఎదురుగా తాటిపూడి రిజర్వాయర్‌ అందాలు మైమరపింప జేస్తున్నాయి. ఒక్కో కాటేజీలో రెండు బెడ్‌ రూములు, ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడకి వచ్చే వారికి బొంగు చికెన్‌ లాంటి ఆహార పదార్థాలను వేడి వేడిగా అందించేందుకు రెస్టారెంట్‌ ఉంది. కాటేజీ అద్దె రోజుకు రూ.2500గా ఉంది. అలాగే ఇక్కడ ఆఫీసు సమావేశాలు లేదా కుటుంబ వేడుకల కోసం విశాలమైన మీటింగ్‌ హాల్‌ ఉంది. మీటింగ్‌ హాల్‌కు చార్జీ రూ.5000. ముందుగా ఆర్డర్‌ ఇస్తే ఆహార పదార్థాలు ఇక్కడే తయారు చేసి అందిస్తారు. అలాగే గిరిజన సంస్కృతిని ప్రతిబించేలా థింసా, మయూరి నృత్యం ఉంటాయి. అతిథుల కోరిక మేరకు వీటిని ఏర్పాటు చేస్తారు. ఇవే కాకుండా చలికాలం క్యాంపు ఫైర్‌ సదుపాయం ఉంది. సాహస ప్రియుల కోసం కాటేజీల సమీపంలో అద్భుతమైన ట్రెక్కింగ్‌ పాత్‌(కొండ మార్గం) కూడా ఉంది.

చేరుకోవడం ఇలా..

తాటిపూడికి విజయనగరం నుంచి 32 కిలోమీటర్లు కాగా విశాఖ నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. ఎస్‌.కోట అరుకు రోడ్డు నుంచి 14 కిలోమీటర్లు దూరంలో ఉంది. విజయనగరం -ఎస్‌.కోట జాతీయ రహదారిపై అయితన్నపాలెం జంక్షన్‌ నుంచి కేవలం 7 కిలోమీటర్లు దూరంలో తాటిపూడి ఉంది.

మరిన్ని సదుపాయాలు

తాటిపూడి రిజర్వాయర్‌ ఆవల ఎకో టూరిజం కాటేజీల వద్ద రానున్న రోజుల్లో అదనపు సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. కాటేజీల వద్ద పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్‌ ప్లే పార్కులను ఏర్పాటు చేస్తాం.

- బి.రాంనరేష్‌, ఫారెస్టు రేంజ్‌ అధికారి

Updated Date - Jan 01 , 2026 | 11:32 PM