Eligible Beneficiaries అర్హులందరికీ పథకాలు అందాలి
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:50 PM
Ensuring Benefits Reach All Eligible Beneficiaries కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జిల్లాలో అర్హులందరికీ అందాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో దిశ (జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశాన్ని నిర్వహించారు.
హాజరైన ఎంపీ తనూజారాణి
పలు అంశాలపై చర్చ
పార్వతీపురం/టౌన్ సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జిల్లాలో అర్హులందరికీ అందాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో దిశ (జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిపారుదల, పైప్‌లైన్ పురోగతిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలన్నారు. మొదటి రోజు నుంచే పక్కా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. 15 రోజుల కొకసారి పురోగతి సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఒక్క మలేరియా కేసు నమోదు కాకుండా చూడాలని.. స్ర్పేయింగ్, ఐఆర్‌ఎస్ చర్యలతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రెస్, టీవీ, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
అంతకుముందు ఎంపీ తనూజారాణి మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్రం అందిస్తున్న నిధులతో మౌలిక వసతులు, ఉపాధి హామీ పనులు, తాగునీరు, రోడ్లు నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. పథకాల అమలుకు సంబంధించి మార్పులు, లేదా మెరుగైన సూచనలు ఉంటే చర్చించాలన్నారు. గతంలో రద్దయిన లేదా పెండింగ్‌లో ఉన్న పార్లమెంట్ నిధులను ఇతర పనులకు కేటాయించే అవకా శాలను పరిశీలించి నివేదికలను అందించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాగా జిల్లాలో పర్యాటక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలల భవనాల నిర్మాణం కోసం నిధులను కేటాయించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.