పనుల్లో నాణ్యత పాటించండి
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:15 AM
పనుల్లో నాణ్యతా ప్రమాణా లు పాటించాలని ఇంజినీరింగ్ అధికారులను ఐటీడీఏ పీవో వైశాలి ఆదేశించారు.
కురుపాం రూరల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పనుల్లో నాణ్యతా ప్రమాణా లు పాటించాలని ఇంజినీరింగ్ అధికారులను ఐటీడీఏ పీవో వైశాలి ఆదేశించారు. గురువారం నీలకంఠాపురంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న వివిధ ఇంజినీరింగ్ పనులను ఆమె పరిశీలించారు. పనుల్లో నాణ్యతా లోపాలు ఉండరాదని ఆదేశించారు. అనంతరం మరుగుదొడ్లు, రక్షిత తాగునీరు, స్నానపు గదులు, సిక్ రూమ్‌లను పరిశీలించారు. బాలికలకు పరిశుభ్ర వాతావరణంలో వసతి కల్పించాలని సంక్షేమాధికారి ఒమ్మి చిలకమ్మను ఆదేశించారు. అనంతరం తరగతి గదిలో బాలికల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. బాలికలకు గణిత క్విజ్ నిర్వహించారు. పాఠ్యాంశాల్లో సందేహాలు ఉంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పదవ తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేటట్టు బోధన కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు.