Better Medical Care రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:37 PM
Ensure Better Medical Care for Patients సీతంపేట ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు.
సీతంపేట రూరల్, ఫిబ్రవరి3(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఓపీ విభాగంలో రద్దీని గమనించిన ఆయన.. రోగులు గంటల తరబడి క్యూలో నిలబడకుండా బెంచీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న రోగుల కోసం వీల్‌చైర్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. వారికి సహాయం అందించడానికి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవకుల సంఖ్యను పెంచాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్యం, భోజన సౌకర్యాలు, మందులు పంపిణీని పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, అత్యవసర మందుల కొరత లేకుండా చూడాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావును ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మాతా,శిశు మరణాలను పూర్తిగా నివారించాలన్నారు. 24గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.
పాఠశాల పరిశీలన...
సీతంపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా క్రీడామైదానాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. మైదానంలో పిచ్చిమొక్కలను తొలగించి పచ్చదనం పెంపొందించాలని ఎంఈవో ఆనందరావుకు సూచించారు. భవిష్యత్‌లో అదనపు తరగతుల అవసరం ఉంటే ప్రస్తుతం ఉన్న భవనాలపైన నిర్మించుకోవాలని, ఇందుకోసం ఆటస్థలాన్ని కేటాయించకూడదని స్పష్టం చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు ప్రాథమిక ప్రశ్నలు వేసి వారి వద్ద నుంచి సమాధానాలు రాబట్టారు. పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, వారంలోగా ప్రాంగణాలన్నీ ‘ముస్తాబు’ కావాలని ఆదేశించారు. ఎంఈవోలు కేవలం కార్యాల యాలకే పరి మితం కాకూడదన్నారు. క్రమం తప్పకుండా పాఠశాలలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టిసారించి వారి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌక ర్యాల్లో ఎటువంటి లోపాలు ఉండకూడదని తెలిపారు. రానున్న పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఏపీవో జి.చిన్నబాబు తదితరులు ఉన్నారు.