Share News

50 మీటర్ల దూరంలో శత్రువు

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:53 AM

అది మైనస్‌ డిగ్రీల చలి ప్రాంతం. నిలువెత్తు మంచుకొండలు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శత్రువుతో జరిపిన హోరాహోరి పోరు. 1999లో పాకిస్థాన్‌ కుట్రలను తిప్పికొడుతూ భారత సైన్యం సాధించిన విజయమే కార్గిల్‌ యుద్ధం.

50 మీటర్ల దూరంలో శత్రువు
సురగాలి పోలయ్య, ఆనరరీ కెప్టెన్‌, కార్పస్‌ ఆఫ్‌ సిగ్నల్స్‌ (రిటైర్డు), రెడ్డి అప్పలనాయుడు, రిటైర్డు సుబేదార్‌, - కొల్లి జగన్నాథంనాయుడు, మాజీ సైనికుడు

  • బాంబుల మోతతో కొండలు దద్దరిల్లేవి

  • వారంపాటు తిండి, నిద్రలేక రాయి కింద..

  • కార్గిల్‌ యుద్ధం వీరుల వీరోచిత అనుభవాలు

  • నేడు కార్గిల్‌ విజయ్‌ దివస్‌

అది మైనస్‌ డిగ్రీల చలి ప్రాంతం. నిలువెత్తు మంచుకొండలు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శత్రువుతో జరిపిన హోరాహోరి పోరు. 1999లో పాకిస్థాన్‌ కుట్రలను తిప్పికొడుతూ భారత సైన్యం సాధించిన విజయమే కార్గిల్‌ యుద్ధం. జూలై 26న కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని ఆనాటి రణరంగంలో ప్రత్యక్షంగా పాల్గొని శత్రువును తుదముట్టించిన బొబ్బిలికి చెందిన పలువురు సైనికులు తమ వీరోచిత అనుభవాలను పంచుకున్నారు.

బొబ్డిలి, జూలై 22(ఆంధ్రజ్యోతి): 1999 మేలో పాకిస్థాన్‌ ఆర్మీకి చెందిన 6న నార్తర్న్‌ లైట్‌ ఇన్పాంట్రీ కొండ ప్రాంతంలోకి చొరబడి స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. భారత గొర్రెల కాపరులు ఇచ్చిన సమచారంత అప్రమత్తమైన భారత సైన్యం ఆపరేషన్‌ విజయ్‌ను ప్రారంభించింది. ఎత్తయిన మంచు పర్వతాలపై శత్రువు వ్యూహాత్మక స్థానాల్లో ఉన్నప్పటికీ, భారత జవాన్లు ప్రాణాలు పణంగా పెట్టి శత్రుమూకలను ఏరిపారేశారు.

చావును దగ్గరగా చూశాం

కొల్లి జగన్నాథం నాయుడు, మాజీ సైనికుడు

కార్గిల్‌ యుద్ధ సమయంలో తీవ్రమైన పాయింట్ల వద్ద విధి నిర్వహణ చేశాం. శత్రువులు, మాకు మధ్య కేవలం 50 మీటర్ల దూరం ఉండేది. వారం రోజులు ఒకే రాయి కింద తిండి, నిద్ర లేకుండా గడిపాం. శత్రువులు వేసే బాంబు దాడులకు కొండలన్నీ ప్రతిధ్వనించేవి. మేము ఉన్న బంకర్లపై ఆర్టిలరీ షెల్స్‌ పడినా ప్రాణాలతో బయటపడ్డాం. ఆ సమయంలో ప్రతి క్షణమూ మరణాన్ని ఎదుర్కొన్నాము. ఈ రోజు బతికి ఉండడం మాకు రెండో జీవితం వంటిదే.

శత్రువుల కదలికలను పసిగట్టాం

సురగాలి పోలయ్య, ఆనరరీ కెప్టెన్‌, కార్పస్‌ ఆఫ్‌ సిగ్నల్స్‌ (రిటైర్డు)

ఇండో పాక్‌ సరిహద్దులో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ (జేసీవో) ఇన్‌చార్జిగా పని చేశాను. శత్రుదేశ కమ్యూనికేషన్‌ వ్యవస్థను పర్యవేక్షించడం నా ప్రధాన బాధ్యత. లష్కరోతోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తీవ్రవాదులకు పాక్‌ సైన్యం సహకరిస్తూ చొరబాటుకు యత్నించగా భారత సైన్యం చాకచక్యంగా తిప్పికొట్టింది. భారత సైన్యంలో పనిచేయడం నా జీవితంలో అత్యంత గర్వకారణం.

త్రివిధ దళాల సమన్వయమే విజయ రహస్యం

రెడ్డి అప్పలనాయుడు, మాజీ సుబేదార్‌

భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం సమన్వయంతో పోరాడి విజయం సాధించాయి. అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా కార్గిల్‌ స్మారక చిహ్నం నిలుస్తోంది. దేశరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం. యువత దేశభక్తిని పెంపొందించుకుని సాయుధ దళాల్లో చేరాలి.

Updated Date - Jul 26 , 2026 | 12:53 AM