Share News

Endless tragedies అంతులేని విషాదాలు

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:16 AM

Endless tragedies మెంటాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది డిసెంబర్‌లో మద్యంమత్తులో ద్విచక్రవాహనం నడుపుతూ బొండపల్లి మండలం దేవుపల్లి వద్ద హైవేపై ఎదురుగా ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టాడు. నాలుగురోజులు మృత్యువుతో పోరాడి మృతిచెందాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన మరణంతో భార్య, పిల్లలు వీధినపడ్డారు.

Endless tragedies అంతులేని విషాదాలు

అంతులేని విషాదాలు

రక్తమోడుతున్న రహదారులు

వీధినపడుతున్న భాధిత కుటుంబాలు

జిల్లాలో ఆందోళన పరుస్తున్న రోడ్డు ప్రమాదాలు

మూడేళ్లలో 1919 యాక్సిడెంట్లు

673 మంది మృత్యువాత

గాయపడినవారి సంఖ్య 2384

ఈఏడాది జనవరి నుంచి మార్చి వరకు 137 రోడ్డు ప్రమాదాలు

42 మంది మృతి, 188 మంది క్షతగాత్రులు

వాహనదారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమంటున్న పోలీసులు

- మెంటాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది డిసెంబర్‌లో మద్యంమత్తులో ద్విచక్రవాహనం నడుపుతూ బొండపల్లి మండలం దేవుపల్లి వద్ద హైవేపై ఎదురుగా ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టాడు. నాలుగురోజులు మృత్యువుతో పోరాడి మృతిచెందాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన మరణంతో భార్య, పిల్లలు వీధినపడ్డారు.

- అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలవలస గ్రామానికి చెందిన ఓ యువకుడు మెంటాడ మండలం గుర్ల గ్రామం వద్ద గత ఏడాది డిసెంబర్‌ 10న ఇటుకలు తరలిస్తుండగా ట్రాక్టర్‌ బోనెట్‌ పైనుంచి కిందకు జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లిదండ్రులకు అతనొక్కడే సంతానం. ఈ ఘటనతో తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలింది.

విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. మూడేళ్ల వ్యవధిలో ఏటా ప్రమాదాలు, మృతులు, గాయపడ్డవారి సంఖ్యలో స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా సగటున మాత్రం ఒకేరీతిన ఉండడం ఆందోళనపరుస్తోంది. ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం అవిశ్రాతంగా చర్యలు చేపడుతున్నా.. వాహనదారుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం ముందు అవి నిష్ఫలమవుతున్నాయి. దీనికి మూడేళ్ల గణాంకాలే రుజువుగా నిలుస్తున్నాయి. 2023, 2024, 2025 సంవత్సరాల్లో మొత్తం 1919 రోడ్డుప్రమాదాలు సంభవించగా 673 మంది మృత్యువా తపడ్డారు. 2384 మంది క్షతగాత్రులై జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. గత మూడు నెలల్లో అంటే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరువరకు జరిగిన రోడ్డు ప్రమాదాలు, మృతులు, గాయపడ్డవారి సంఖ్య..పై గణాంకాలకు అదనం. వీటిని కూడా చేర్చితే గత మూడు సంవత్సరాల మూడునెలల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 2056 కాగా 715 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య 2552కి పెరిగింది. దీన్ని బట్టి రోడ్డు ప్రమాదాల కారణంగా జిల్లాలో మృత్యుఘోష స్థాయిని అంచనా వేయవచ్చు.

ఫ 2026 జనవరి 1 నుంచి మార్చి 31వరకు జరిగిన 137 రోడ్డుప్రమాదాల్లో 42మంది చనిపోగా 188 మంది క్షతగాత్రులయ్యారు. ఈవన్నీ పోలీసు రికార్డుల్లో నమోదైన గణాంకాలు. స్థానికంగా రాజీపడి, పోలీసుల లెక్కల్లోకి ఎక్కని వివరాలు వీటికి అదనం.

కారణాలివే..

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, నిద్రమత్తులో డ్రైవింగ్‌, మద్యం మత్తులో వాహనాలు నడపడం, హెల్మెట్‌ధారణలో అంతులేని నిర్లక్ష్యం, మైనర్ల డ్రైవింగ్‌, మితిమీరిన వేగం, ఓవర్‌ టేక్‌ చేయడం, కాలం చెల్లిన వాహనాలు, రేస్‌ బైక్‌లు వాడడం ఇవన్నీ ప్రమాదాలకు కారణాలుగా ఉన్నాయి. రెప్పపాటులో ప్రమాదాలు జరిగిపోతున్నాయి. అయినా ప్రాణం విలువ తెలీకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. జరుగుతున్న రోడ్డుప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్న దృశ్యాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, శాశ్వత వైకల్యంతో మంచానికే పరిమితమై జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న అభాగ్యులు తారసపడుతున్నా వాహనదారుల్లో మార్పు కానరాకపోవడం విస్మయపరుస్తోంది. ఎవరికివారు స్వీయ జాగ్రత్తలు పాటించినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:16 AM