పదవీకాలం ముగింపు
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:56 PM
జిల్లాలో 15 మండలాల ఎంపీపీలతో పాటు ఎంపీటీసీల పదవీకాలం బుధవారం ముగియనుంది.
- నేడు ఎంపీటీసీలది.. రేపు జడ్పీటీసీలది
- 15 మండలాలకు ప్రత్యేక అధికారులు
- జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్
పార్వతీపురం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 15 మండలాల ఎంపీపీలతో పాటు ఎంపీటీసీల పదవీకాలం బుధవారం ముగియనుంది. వీరంతా ఇక మాజీలుగా మారనున్నారు. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయాల్లో ఎంపీటీసీల ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా కొత్తగా ఏర్పడడంతో, ఇక్కడ ఎంపీటీసీల ఎన్నికలు జరగనున్నాయి. కాగా, స్థానిక ఎన్నికలు జరిగే వరకు జిల్లాలోని 15 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆమోదం కోసం ఫైల్‌ను పంపించారు. గురువారం నుంచి మండల పరిషత్‌ల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభంకానుంది.
రేపటితో జడ్పీ పాలకవర్గం..
ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో కొనసాగుతున్న జడ్పీ పాలకవర్గం గడువు గురువారం ముగియనుంది. విజయనగరం జిల్లా పరిధిలో సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల జడ్పీటీసీలు, శ్రీకాకుళం జడ్పీ పరిధిలో పాలకొండ నియోజకవర్గ జడ్పీటీసీ ఉన్నారు. వీరందరూ ఇకపై మాజీలుగా మారనున్నారు. 25 నుంచి పార్వతీపురం జిల్లా పరిషత్‌లో అధికారక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి వ్యవహరించనున్నారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాలకు చెందిన 15 మండలాల ఎంపీడీవోలు, కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంది. నాలుగు నియోజకవర్గాలకు జిల్లా పరిషత్ ద్వారా నిధుల నిర్వహణ ఉంటుంది. దీనిపై జడ్పీ సీఈవో లవరాజును వివరణ కోరగా.. ‘మండల పరిషత్‌ల పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో ప్రత్యేక అధికారులు నియామకం చేపడుతున్నాం. కలెక్టర్ ఆమోదం పొందిన వెంటనే ప్రత్యేక అధికారుల పాలనలో కార్య క్రమాలు ప్రారంభమవుతాయి.’ అని తెలిపారు.