Share News

encroachment plane on those 34 acres ఆ 34 ఎకరాలపై కన్ను

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:24 PM

encroachment plane on those 34 acres లోతుగెడ్డ పంచాయతీ కొండ ఇప్పలవలస గ్రామంలో సుమారు 34 ఎకరాల విస్తీరంతో ఉన్న బాట్‌ ఇన్‌ ల్యాండు(రికార్డుల్లో ఎవరికీ చెందని భూమి) వ్యవహారం కొత్తమలుపు తిరుగుతోంది. ఇందులో ఉన్న దాదాపు రూ.40 లక్షల విలువ చేసే నీలగిరి చెట్లపై కన్నేసిన కొందరు వ్యక్తులు ఆ చెట్లను దౌర్జన్యంగా నరికివేయించి సొమ్ము చేసుకోవాలని చూశారు.

encroachment plane on those 34 acres ఆ 34 ఎకరాలపై   కన్ను
బాట్‌ ఇన్‌ ల్యాండ్‌లో ఏపుగా పెరిగిన నీలగిరి

ఆ 34 ఎకరాలపై

కన్ను

బాట్‌ ఇన్‌ ల్యాండుపై గద్దలు

భూముల విలువ రూ.6 కోట్లు పైమాటే

మాదంటే మాదంటూ వాదనలు

వృక్షసంపద నరికివేతకు ఎత్తుగడలు

సూత్రధారులపై ఆరా తీస్తున్న పోలీసులు

లోతుగెడ్డ పంచాయతీ కొండ ఇప్పలవలస గ్రామంలో సుమారు 34 ఎకరాల విస్తీరంతో ఉన్న బాట్‌ ఇన్‌ ల్యాండు(రికార్డుల్లో ఎవరికీ చెందని భూమి) వ్యవహారం కొత్తమలుపు తిరుగుతోంది. ఇందులో ఉన్న దాదాపు రూ.40 లక్షల విలువ చేసే నీలగిరి చెట్లపై కన్నేసిన కొందరు వ్యక్తులు ఆ చెట్లను దౌర్జన్యంగా నరికివేయించి సొమ్ము చేసుకోవాలని చూశారు. విషయం తెలుసుకున్న ఆ భూమి పూర్వ లబ్ధిదారులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వీఆర్వో అల్లు రేవతి దీనిపై తహసీల్దార్‌కు, ఆండ్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ అజ్ఞాత వ్యక్తుల గురించి కూపీ లాగుతున్నారు.

మెంటాడ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): లోతుగెడ్డ పంచాయతీ కొండ ఇప్పలవలస గ్రామ సమీపంలోని సర్వే నంబరు 7లో 19.25 ఎకరాలు, సర్వే నంబరు 10లో 15.29 ఎకరాలు వెరసి 34.54 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో బాట్‌ ఇన్‌ ల్యాండుగా నమోదై ఉంది. స్థానిక గిరిజన కుటుంబాల పూర్వీకులు ఆ భూమిని సాగుచేసుకునేవారు. వారు అందులో వృక్షసంపదను సంరక్షించు కుంటూ ఫలసాయాన్ని అనుభవిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి శిస్తులు చెల్లించలేదు. దీంతో ప్రభుత్వం ఆ భూమిని సుమారు ముఫ్పై ఏళ్ల క్రితం వెనక్కి తీసుకొంది. రికార్డుల్లో ఎవరికీ చెందని భూమి (బాట్‌ ఇన్‌ ల్యాండు)గా నమోదు చేసింది. అయితే ఈ భూముల్లోని నీలగిరి మొక్కలు ఏపుగా పెరిగి కోతకు అందివచ్చిన క్రమంలో ఆ పంటను అనుభవించేందుకు ఎవరికి వారు అనేకమార్లు ప్రయత్నించారు. విషయం తెలుసుకొని అధికారులు అడ్డుకొని అందులోని వృక్షసంపద జోలికి ఎవరూ వెళ్లరాదని ఆదేశాలు జారీచేశారు. దీంతో కొన్నాళ్లుగా వివాదం నడుస్తూనే ఉంది. ఆ భూమి పూర్వ లబ్ధిదారుల వారసులు ఆ భూమిని విశాఖకు చెందిన వ్యక్తికి లీజుకు ఇచ్చేసారని, ఆయన నీలగిరి మొక్కలు నాటారని చెబుతున్నారు. ఆ భూమిని ఎవ్వరికీ లీజుకు ఇవ్వలేదని, తమకే పూర్తిహక్కు ఉందని గిరిజనులు వాదిస్తున్నారు. ఎవ్వరికీ హక్కులేదని అది ప్రభుత్వభూమి అని అధికారులు చెబుతున్నారు.

వారం కిందట..

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నీలగిరితోటపై కన్నేశారు. వారం క్రితం కొన్ని నీలగిరి చెట్లను అక్రమంగా నరికివేసినట్లు స్థానిక వీఆర్వో రేవతికి సమాచారం అందింది. ఆమె వెళ్లే సమయానికి వారు పరారీ అయ్యారు. ఈ విషయాన్ని తహసీల్దార్‌కు వీఆర్‌వో తెలియజేశారు. ఆయన సూచన మేరకు ఆండ్ర పోలీసులకూ ఫిర్యాదు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలానికి చెందిన వారు నీలగిరి తోటను నరికినట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే పాత్రధారులు వీరైనప్పుడు తెరవెనుక సూత్రధారులు ఎవరై ఉంటారనే విషయాన్ని కూపీ లాగుతున్నారు.

ఆ భూమిని చేజిక్కించుకోవాలని..

ఒకరి తర్వాత ఒకరు నీలగిరి చెట్ల నరికివేతకు రావడం వెనుక పెద్ద పథకమే నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరికీ చెందని భూములుగా రికార్డుల్లో నమోదై ఉన్నందున, దాన్ని క్యాష్‌ చేసుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో తరహా తెలివితేటలు ప్రదర్శిస్తున్నా.. అందరి లక్ష్యం ఆ 34 ఎకరాలే. ప్రస్తుతం వాటి విలువ కనిష్ఠంగా ఆరేడు కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. ఈనేపథ్యంలోనే పూర్వాశ్రమంలో ఆ భూమి తమ పూర్వీకులదని కహానీలు అల్లుతూ, ఆధారాలుగా కోర్టులో ఉన్న వ్యాజ్యాన్ని తెరపైకి తెస్తున్నారు.

ఫ అధికారులు...ఈ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటేనే తప్ప ఏళ్ల తరబడి నడుస్తున్న హైడ్రామాలకు తెరపడే అవకాశం లేదు. ఆ భూమిలో ప్రభుత్వభూమిగా బోర్డులు ఏర్పాటు చేసి, ఆశావహులకు నోటీసులు జారీచేస్తే గాని వారి ఆగడాలు ఆగవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ముందే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి

బాట్‌ ఇన్‌ ల్యాండ్‌పై కొందరు కన్నేసారని, వృక్ష సంపదను కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో ఫిబ్రవరి 11న ’భూ చోళ్లు’ శీర్షికన కథనం ముద్రితమైంది. అధికారులు కఠినంగా లేకపోవడంతో వేర్వేరు వర్గాలు భూములను చేజెక్కించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.

పోలీసులకు ఫిర్యాదు చేశాం

కొన్నాళ్లు క్రితం బాట్‌ ఇన్‌ ల్యాండ్‌లో ఎవరో మొక్కలు నరికినట్లు సమాచారం అందింది. అప్రమత్తం అయ్యాము. పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఈ భూముల వ్యవహారాన్ని పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఆ భూమిలోకి ఎవరైనా ప్రవేశించి మొక్కలు నరికితే క్రిమినల్‌ చర్యలకు గురవుతారు. రికార్డుల్లో బాట్‌ ఇన్‌ ల్యాండుగా నమోదై ఉన్నందున దీన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే విషయమై ఉన్నతాధికారులతో చర్చించి, వారి సూచనల మేరకు ముందుకు వెళ్తాం.

- విజయభాస్కర్‌, తహసీల్దార్‌, మెంటాడ

Updated Date - Aug 08 , 2026 | 11:24 PM