Building Shops! ప్రభుత్వ స్థలం ఆక్రమించి.. షాపులు నిర్మించి!
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:21 AM
Encroaching Government Land.. Building Shops! మక్కువలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. సుమారు రూ. 2.65 కోట్లతో రోడ్డు విస్తరణ, కాలువల నిర్మాణం జరుగుతుండగా మరోవైపు కొంతమంది కాలువల పక్కనే ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్డులు వేసి వ్యాపారాలు సాగిస్తున్నారు.
పనులు నిలిపేయాలని ఆదేశం
మక్కువ, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): మక్కువలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. సుమారు రూ. 2.65 కోట్లతో రోడ్డు విస్తరణ, కాలువల నిర్మాణం జరుగుతుండగా మరోవైపు కొంతమంది కాలువల పక్కనే ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్డులు వేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. తాజాగా సువర్ణముఖి వంతెన సమీపంలో కాలువను అనుసరించి ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించి ఏడు షాపుల నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని గ్రామస్థులు ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు శనివారం ఉప తహసీల్దార్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఆర్‌ఐ శ్రీనివాసరావు సర్వే సిబ్బంది అక్రమంగా షాపులు నిర్మిస్తున్న స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు ఆనుకుని కట్టిన షాపులు, జిరాయితీ స్థలాలకు మధ్యన ఉన్న ప్రాంతంలో సర్వే చేపట్టారు. నది సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించి.. ఇంతవరకు చేపట్టిన పనులు వెంటనే నిలుపుదల చేయాలని ఉప తహసీల్దార్ ఆదేశించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆక్రమణదారులను హెచ్చరించారు.