Encouragement for education చదువుకు ప్రోత్సాహం
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:14 AM
Encouragement for education కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను బరింత బలోపేతం చేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గుణాత్మక విద్యాబోధనకు చర్యలు తీసుకుంటోంది.
చదువుకు ప్రోత్సాహం
విద్యార్థులకు అండగా ప్రభుత్వ పాఠశాలలు
పోషకాహారం.. గుణాత్మక విద్య బోధనకు అవకాశం
పుస్తకాలు, యూనిఫాం, షూస్, సాక్స్‌లు, స్కూల్‌బ్యాగ్‌లు ఉచితం
డిజటల్ బోధన.. క్రీడలకు ప్రాధాన్యం
ఉన్నత పాఠశాలల్లో చదివేవారికి బస్‌పాస్‌లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను బరింత బలోపేతం చేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గుణాత్మక విద్యాబోధనకు చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు బలపం నుంచి యూనిఫాం, స్కూల్‌బ్యాగ్‌లు, పుస్తకాలను ఉచితంగా ఇవ్వడంతో పాటు పోషకాహారం అందిస్తోంది. బాలికల ఆరోగ్య రక్షణకు ప్రతీ నెలా వైద్యపరీక్షలు నిర్వహించి వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణకు సూచనలు ఇస్తోంది. విద్యార్థుల్లో దాగిన ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సాహకాలు అందిస్తోంది. మరోవైపు క్రీడలు, యోగాపై శిక్షణ ఇస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తోంది.
విజయనగరం కలెక్టరేట్, జూన్ 11(ఆంధ్రజ్యోతి):
జిల్లా వ్యాప్తంగా 1319 ప్రాథమిక, 128 యూపీ, 272 జిల్లా పరిషత్, 31 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 2025-2026 విద్యా సంవత్సరంలో లక్షా 9 వేల మంది విద్యార్థులు చదువుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్కారు పాఠశాలల్లో చదివే పిల్లలకు అనేక రూపాల్లో ప్రోత్సాహం లభిస్తోంది.
- పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఆర్థిక సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో గతేడాది నుంచి పథకం అమలు చేస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదివితే అంతమందికీ రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది.
- సుదూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కోసం వసతిగృహాల్లో ఉంటూ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
- సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా స్కూల్ బ్యాగ్, యూనిఫాం, షూస్, సాక్స్‌లు, పుస్తకాలు, నోట్‌పుస్తకాలను ఉచితంగా అందిస్తోంది.
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తోంది. పోర్టిఫైడ్ సన్నబియ్యంతో తయారు చేసిన అన్నం, వారానికి 5 రోజులు గుడ్లు, రాగిజావ లేదా చిక్కి వంటి పోషకాహార పదార్థాలు కూడా ఇస్తున్నారు.
- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన, స్మార్ట్‌టీవీలు, డిజిటల్ కంటెంట్‌తో సాంకేతిక విద్యను బోధిస్తున్నారు.
- ప్రభుత్వపాఠశాలలను బలోపేతం చేసేందుకు మన బడి- మన భవిష్యత్ పేరుతో కొత్తతరగతి గదులతో పాటు డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తోంది.
- ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల్లో వ్యక్తిత్వ నైపుణ్యాలను పెంపుదించేందుకు పాలీల్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది.
- ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల పదో తరగతి మార్కుల ఆధారంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం, నూజివీడు, ఇడుపులపాయి ట్రిపుల్ ఐటీలో చదివేవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
- పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు రవాణా ఖర్చుల కోసం భత్యం అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క విద్యార్ధికి ఏడాదికి రూ.6వేల వరకు ఈ సహాయం అందుతోంది.
- ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత కోసం ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది.
- విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక అవార్డులు, గుర్తింపు అందించేందుకు అబ్టుల్ కలాం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తోంది.
- ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర అర్హత కలిగిన విద్యార్థులకు ప్రి-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్ షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.
- సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆర్వోప్లాంటులను ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చదవడం వల్ల ఎటువంటి ఖర్చు లేదు. యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్, షూలను ఉచితంగా అందజేస్తున్నారు. తాము ఇంటి వద్ద పెట్టలేని స్థాయిలో భోజనం పెడుతున్నారు. అర్హత, అనుభవం గల ఉపాధ్యాయులు ఉన్నారు. మా పిల్లల విద్యపై పర్యవేక్షణ కూడా ఉంటోంది. చక్కని ఫర్నీచర్, సదుపాయాలు ఉన్నాయి.
- కె.రాజు, విద్యార్థి తండ్రి, రామవరం, గంట్యాడ మండలం
ఒత్తిడి లేని విద్యా భోదన
ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయులున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతోంది. ప్రతి విద్యార్థి గురించి తెలుసుకుంటున్నాం. నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. మధ్యాహ్నం వేడివేడి భోజనం అందజేస్తున్నాం. వారానికి ఐదు రోజులు గుడ్డు ఇస్తున్నాం. పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్‌లు, షూలు అందిస్తున్నాం. విద్యార్థులకు ఒత్తిడి లేని బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యం. ఫలితాలు కూడా కార్పొరేట్ స్కూల్స్ కంటే అధికంగా వస్తున్నాయి. ఈ ఏడాది చాలా మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపారు.
- యు.మాణిక్యంనాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి
బడికి వేళాయె
కొత్తగా 2500 మంది విద్యార్థుల నమోదు
విజయనగరం కలెక్టరేట్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగిశాయి. శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాఠశాలల్లో కొత్తగా 2500 మంది విద్యార్థులు నమోదయ్యారు. తరగతులు ప్రారంభం కానుండడంతో గదులను శుభ్రం చేశారు. మధ్యాహ్న భోజన కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలి రోజున విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలకనున్నారు. అందుకు వెల్‌కమ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మొదటి రోజునే మన మిత్ర కిట్లు అందజేయనున్నారు. 1,09000 మంది విద్యార్థులకు మన మిత్ర కిట్ల ద్వారా 10 రకాలు వస్తువులు అందజేస్తారు. మూడు జతలు యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, స్కూల్ బ్యాగ్‌లు, షూలు ఇస్తారు. కాగా ఒకటో తరగతి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థుల పాఠ్య పుస్తకాలు మారాయి. ఈ ఏడాది నుంచి కొత్త సిలబస్‌లో చదవనున్నారు. ఇక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపించాయి. బడి బస్సులు కూడా సిద్ధం చేశారు.
----------------------