Natural Farming ప్రకృతి సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:59 PM
Encourage Farmers to Adopt Natural Farming జిల్లాలో రైతులు ప్రకృతి సాగువైపు అడుగులు వేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. తక్కువ శ్రమతో అధిక దిగుబడి, రాబడినిచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
పార్వతీపురం, మార్చి4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులు ప్రకృతి సాగువైపు అడుగులు వేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. తక్కువ శ్రమతో అధిక దిగుబడి, రాబడినిచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఏ నేలకు ఏ పంట అనువైనదో శాస్త్రవేత్తలు వివరించాలన్నారు. విత్తనం నాటినప్పటి నుంచి పంట విక్రయం వరకు రైతులకు భరోసా కల్పించాలని సూచించారు. కోళ్ల పెంపకం ద్వారా వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం పెంచాలన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా నిరుద్యోగులను గుర్తించి కొత్త యూనిట్లు స్థాపనలో వారికి తోడ్పాటు అందించాలని ఆదేశించారు. పాడి రైతులు కేవలం పాలు అమ్మడమే కాకుండా పన్నీరు వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దోమల నివారణకు గంభూషియా చేపలను నీటి నిల్వల్లో విడిచిపెట్టాలన్నారు. సీతానగరం మండలంలోని కోట సీతారాంపురం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీపీవో టి.కొండలరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మార్ట్ ప్రాజెక్టుతో ప్రగతి బాట
మార్ట్ ప్రాజెక్టు.. జిల్లా ప్రగతికి సరికొత్త బాట వేయనుందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. దీనికి సంబంధించి ప్రతి శాఖాధికారి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలతో రైతులు, మహిళల ఆదాయం రెట్టింపు కావాలని తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన మాట్లాడుతూ.. మహిళలు కేవలం గృహిణులుగా కాకుండా చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మార్ట్ ఒక వేదిక కావాలన్నారు. రైతులు తమ పంటను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా విక్రయించుకునేలా మార్కెట్ లింకేజ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులు క్రాప్ డైవర్ఫికేషన్ వైపు మళ్లాలని సూచిం చారు. వాణిజ్య, ఉద్యాన పంటలను ప్రోత్సహించి.. రైతుల తలసరి ఆదాయం పెంచడమే మార్ట్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు.
పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలి
జిల్లాల్లో రీసర్వే ప్రక్రియతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలని సీసీఎల్‌ఏ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి ఆదేశించారు. నిషేధిత భూముల జాబితాలో అర్హులైన వారికి భూ హక్కులు కల్పించాలన్నారు. రెవెన్యూ అంశాలపై బుధవారం అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసీలు, డీఆర్వోలతో సమీక్షించారు. జిల్లాలో వ్యవసాయ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూ వివరాలపై నివేదిక పంపాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో నమోదైన అర్జీలను పరిష్కరించాలన్నారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి డీఆర్వో హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ప్రత్యేక ఉప కలెక్టర్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.