తీర్థయాత్రకు వెళ్తూ.. మృత్యుఒడికి
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:23 AM
అనుకు న్న పనులు పూర్తికావడంతో రాయగడ వెళ్లి మజ్జిగౌరమ్మ అమ్మవారికి మొక్కు తీర్చుకోవాల నుకున్నారు.. కొన్ని కుటుంబాలు కలిసి వ్యాన్ బుక్ చేసుకుని బయ లుదేరారు.. వాటర్ బాటిల్ కొందా మని మార్గమధ్యలో వ్యాన్ ఆపారు. అంతలోనే లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగిపోయింది.
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ
నలుగురి మృతి
మరొకరి పరిస్థితి విషమం
విజయనగరం/దాసన్నపేట, జూలై 28(ఆంధ్రజ్యోతి): అనుకు న్న పనులు పూర్తికావడంతో రాయగడ వెళ్లి మజ్జిగౌరమ్మ అమ్మవారికి మొక్కు తీర్చుకోవాల నుకున్నారు.. కొన్ని కుటుంబాలు కలిసి వ్యాన్ బుక్ చేసుకుని బయ లుదేరారు.. వాటర్ బాటిల్ కొందా మని మార్గమధ్యలో వ్యాన్ ఆపారు. అంతలోనే లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగిపోయింది. ముగ్గురు అక్కడి క్కడే మృతిచెందగా, ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం అర్ధరాత్రి విజయనగరం సమీపంలోని అయినాడ కూడలి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొత్సపేట గ్రామానికి చెందిన మూడు కుటుంబాలు కలిసి 16 మంది రాయగడ వెళ్లేందుకు వ్యాన్‌ను బుక్ చేసుకున్నారు. బొత్సపేట నుంచి సోమవారం రాత్రి 11 గంటల తర్వాత బయలుదేరారు. వీరి వ్యాన్.. చెల్లూరు నుంచి వస్తున్న మరో కుటుంబం కోసం విజయనగరం దాటాక అయినాడ కూడలి వద్ద రోడ్డు పక్కన ఆగింది. ఇంతలో విశాఖ నుంచి నాగపూర్ వెళ్తున్న లారీ ఈ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. వ్యాన్‌ను 200 మీటర్ల దూరం లాక్కెల్లింది. ఘటనలో ముగ్గురు అక్క డికక్కడే మృతిచెందారు. గాయాలపాలైన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతులు వీరే..
చింతపల్లి రాంబాబు(55) వృత్తిరీత్యా పెయింటర్. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడికి ఇటీవల రైల్వే ఉద్యోగం వచ్చింది. కూతురు ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. భార్య రామచిన్ని గృహిణి. రాంబాబు పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడికి ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మజ్జి నారాయణరావు(47) వృత్తిరీత్యా పెయింటర్. ఈయనకు కుమారు డు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అగ్నివీర్‌లో ఎంపికయ్యాడు. ఆ సంతోషంతో మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ఈయన భార్య అప్పలనారాయణ గృహిణి.
బొత్స మోహననాయుడు(9) ఆరో తరగతి చదువుతున్నాడు. తండ్రి బొత్స రమేష్‌తో కలిసి దేవుడు దర్శనానికి బయ లుదేరాడు. ఈ ప్రమాదంలో మోహననాయుడు మృతిచెందాడు. తండ్రి రమేష్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మజ్జి పైడితల్లి (63).. మృతిచెందిన మోహననాయుడికి అమ్మమ్మ. ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాలై జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
తీర్థయాత్రకు బయలుదేరిన వారిలో బొత్స ఆదినారాయణ తీవ్ర గాయాలై విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టిమి ట్టాడుతు న్నాడు. ఈ దర్శనానికి వెళ్తున్న ఈయనతో పాటు ఆయన కుమారుడు బొత్స గురు నాయుడుకు కాలు విరిగింది. అలాగే గురునాయుడికి సోదరుడు బొత్స లక్ష్మణరా వుకు తలకు బలమైన గాయాలయ్యాయి. వీరితో పాటు బొత్స రాజ్యలక్ష్మీ వెన్ను పూసకు గాయాలయ్యాయి. చింతపల్లి బంగారమ్మకు ఎడమ కాలు విరిగింది. వీరంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల అదుపులో డ్రైవర్
ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా, అతి వేగంగా లారీ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని విజయ నగరం రూరల్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు. లారీని విజయనగరం రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.