Employment, reimagined... ఉపాధి సరికొత్తగా...
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:18 AM
Employment, reimagined... కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అంగ్ అజీవికా మిషన్) పేరుతో వచ్చే నెల 1 నుంచి అమలు కానుంది. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా నియమ నిబంధనలల్ని కేంద్ర ప్రభుత్వ గెజిట్ ద్వారా ఈ నెల 22న ప్రకటించింది. అందుకు అనుగుణంగా పథకం అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీఓ నం.78ను విడుదల చేసింది. కొత్త చట్టం ప్రకారం పథకం అమలులో పలు చేర్పులు, మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఉపాధి సరికొత్తగా...
రెండు దశాబ్దాల పాత విధానానికి తెర
1 నుంచి వీబీజీరామ్‌జీ అమలు
పని దినాలు 120కు పెంపు
పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి
జీవో జారీచేసిన పీఆర్ ఆర్‌డీ శాఖ
రెండు దశాబ్దాల ఉపాధి హామీ చట్టం కొత్త రూపు సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అంగ్ అజీవికా మిషన్) పేరుతో వచ్చే నెల 1 నుంచి అమలు కానుంది. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా నియమ నిబంధనలల్ని కేంద్ర ప్రభుత్వ గెజిట్ ద్వారా ఈ నెల 22న ప్రకటించింది. అందుకు అనుగుణంగా పథకం అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీఓ నం.78ను విడుదల చేసింది. కొత్త చట్టం ప్రకారం పథకం అమలులో పలు చేర్పులు, మార్పులు చోటుచేసుకోనున్నాయి.
చీపురుపల్లి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
వీబీజీ రామ్‌జీలో వేతనదారుల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలతో పాటు ఇటు వ్యవసాయదారులకు మేలు చేకూర్చే మార్పులు పొందుపరిచారు. కొత్త చట్టం ప్రకారం గ్రామీణ కుటుంబాలకు ఇకపై వంద రోజులకు బదులు 120 రోజుల పాటు పని దినాలు కల్పించనున్నారు. వేతనాల చెల్లింపులో ఇప్పుడు జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు కూడా చట్టంలో నిబంధనలను సవరించారు. ఆ ప్రకారం క్రమం తప్పకుండా వారానికి ఒక రోజు వేతనాలు చెల్లిస్తారు. మస్తర్ వేసిన 15 రోజుల్లోగా శ్రామికుల ఖాతాలో తప్పనిసరిగా వేతనాన్ని జమ చేస్తారు. ఆలస్యమైతే తగిన పరిహారాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికీ 15 రోజుల్లోగా పని కల్పించాలి. లేని పక్షంలో ఆ వ్యక్తికి నిరుద్యో భృతి చెల్లించాలని చట్టంలో పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు గ్రామాలను ఏబీసీ మూడు కేటగిరీలుగా విభజిస్తారు. పనులకు సంబంధించి ఎప్పటిలాగే పంచాయతీలే ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలి. పనులు కావాల్సిన వారికి గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డులను (ఇప్పుడున్న జాబ్ కార్డుల స్థానంలో) గ్రామ పంచాయతీలే మంజూరు చేస్తాయి.
ఆ కేటగిరీలకు ప్రత్యేక కార్డులు
అందరితో పాటు కాకుండా సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రత్యేక కార్డులను జారీ చేయడానికి ఈ చట్టంలో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వారు, వెట్టి కార్మికులు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డులు అందజేస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి సామాజిక తనిఖీ నిర్వహించేలా చట్టంలో మార్పులు చేశారు. పనులు, వేతనాలు, మస్తర్ రోల్స్, చెల్లింపుల వివరాలను ప్రజలకు బహిరంగంగా వెల్లడించడం తప్పనిసరి చేశారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్ రెడ్రసల్ వ్యవస్థ, అంబుడ్స్ పర్సన్ వ్యవస్థ అమల్లో ఉంటుంది. పర్యవేక్షణ, జరిమానాలు, మూల్యంకనం, తనిఖీలు, నష్టపరిహారం వసూలు, శిక్షణలకు సంబంధించిన నిబంధనలు కూడా పొందుపరచడం ఈ కొత్త చట్టంలో ప్రత్యేకత.
మారిన నిధుల నిష్పత్తి
పాత ఉపాధి హామీ పథకంలో వేతనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు అందించేది. మెటీరియల్, నిర్వహణ వ్యయంలోనూ 75 శాతం నిధులను కేంద్రం అందించేది. అయితే కొత్త వీబీజీరామ్‌జీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం వ్యయంలో 60:40 నిష్పత్తిలో నిధులు మంజూరు చేస్తాయి.