Employees on strike... patients on tension సమ్మెలో ఉద్యోగులు.. టెన్షన్‌లో రోగులు
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:01 AM
Employees on strike... patients on tension శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి బీపీ (రక్తపోటు)ను తనిఖీ చేస్తున్న ఈ బాలిక స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పారామెడికల్ కోర్సు చదువుతోంది. ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఎఫ్) (మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్ ఫిమేల్) విద్యాభ్యాసంలో భాగంగా ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ప్రాక్టికల్ శిక్షణ పొందుతోంది. అయితే ఆసుపత్రిలో ఎక్కడ చూసినా వీరే కనిపిస్తున్నారు. డీఎంఎల్‌టీ (డిప్లమో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు రోగ నిర్ధారణ పరీక్షలకు రక్తం సేకరిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో విద్యార్థులతోనే అన్ని సేవలు చేయించుకుంటున్నారు.
సమ్మెలో ఉద్యోగులు.. టెన్షన్‌లో రోగులు
పారా మెడికల్ విద్యార్థులతో వైద్య పరీక్షలు చేయిస్తున్న వైనం
రోగ నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు
చేసేదిలేక నిరాశతోనే చికిత్స పొందుతున్న రోగులు
ఆసుపత్రులపై వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె ప్రభావం
ఎంఎల్‌హెచ్‌పీలు, క్షేత్రస్థారు ఏఎన్‌ఎంలకు ఆస్పత్రుల్లో డ్యూటీలు
- శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి బీపీ (రక్తపోటు)ను తనిఖీ చేస్తున్న ఈ బాలిక స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పారామెడికల్ కోర్సు చదువుతోంది. ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఎఫ్) (మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్ ఫిమేల్) విద్యాభ్యాసంలో భాగంగా ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ప్రాక్టికల్ శిక్షణ పొందుతోంది. అయితే ఆసుపత్రిలో ఎక్కడ చూసినా వీరే కనిపిస్తున్నారు. డీఎంఎల్‌టీ (డిప్లమో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు రోగ నిర్ధారణ పరీక్షలకు రక్తం సేకరిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో విద్యార్థులతోనే అన్ని సేవలు చేయించుకుంటున్నారు.
శృంగవరపుకోట, అక్టోబరు9(ఆంధ్రజ్యోతి):
తమ సమస్యల పరిష్కారం కోసం కొన్ని రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు పలు రూపాల్లో నిరసన తెలియజేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెకు దిగారు. విధులకు హాజరుకావడం లేదు. ఆ ప్రభావం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలపై తీవ్రంగా పడుతోంది. రోగులు ఇబ్బందులు పడకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. స్వర్ణ గ్రామ, వార్డుల పరిధిలో వున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (వెల్‌నెస్ సెంటర్)లలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ )లను బుధవారం నుంచి ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ, జిల్లా సాధారణ (పెద్ద ఆసుపత్రి) ఆసుపత్రుల్లో విధులకు పంపిస్తున్నారు. అయినప్పటికీ సిబ్బంది చాలక శిక్షణకు వచ్చిన పారా మెడికల్ విద్యార్థులతో వైద్య సేవలు చేయిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు వీరే చేసేస్తుండడంతో రోగులు అనుమానంగా చూస్తున్నారు.
జిల్లాలోని 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ప్రభుత్వ సామాజిక ఆసుపత్రులు, మరో 4 ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి (జీజీహెచ్), ఘోషా ఆసుపత్రి రోగులకు సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో సుమారు 450 మంది వరకు స్టాఫ్‌నర్స్‌లు, లాబ్ టెక్నీషియన్స్, ఫార్మాసిస్టులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. ప్రతి ఆసుపత్రిలోనూ వీరి సేవలే కీలకం. స్టాఫ్‌నర్సులు ఓపీకి వచ్చే రోగులకు బీపీ, షుగర్, టెంపరేచర్ చూడడంతో పాటు గర్భిణులకు అవసరమైన పరీక్షలు చేస్తారు. నార్మల్, సిజేరియన్ డెలివరీల సమయంలో వైద్యులకు ప్రధాన సహాయకులుగా పనిచేస్తారు. ఇదే విదంగా వైద్యులు సూచించిన అన్నిరకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కూడా వీరి విధి. రోగికి వైద్యులు రాసిన మందులను అందించడానికి ఫార్మసిస్టులు ఉంటారు. వీరంతా సమ్మెకు దిగడంతో శాశ్వత పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సులు, లాబ్ టెక్నీషియన్‌లు, ఫార్మాసిస్టులు ఆసుపత్రులకు వచ్చే రోగులకు సేవలు అందించేందుకు సరిపోవడం లేదు. ఈ కొరతను భర్తీ చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆసుపత్రుల్లో విధులు నిర్వహించేందుకు ఎంఎల్‌హెచ్‌పీలు, గ్రామాల్లో క్షేత్రస్థాయి విధులు నిర్వర్తించే ఏఎన్‌ఎంలను ఆసుపత్రుల విఽధులకు పంపిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఏ, బీ, సీ, జనరల్ నాలుగు షిఫ్ట్‌లుగా డ్యూటీలు వుంటాయి. జనరల్ డ్యూటీ మాత్రమే చేస్తామని పలువురు ఎంఎల్‌హెచ్‌పీలు మెలికపెడుతున్నారు. రాత్రి డ్యూటీలు చేయమంటూ తేల్చిచెప్పేస్తున్నారు. దీంతో ఆయా ఆసుపత్రుల బాధ్యతలను చూస్తున్న వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో తక్షణం రోగులకు వైద్య సహాయం అందించేందుకు పారామెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉపయోగిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి తనిఖీలు చేసే బాధ్యతను అప్పగిస్తున్నారు.
సీనియర్లు లేకుండానే..
నిబంధనల ప్రకారం వీరు రోగులకు సేవలు అందించే సమయంలో వైద్యులు, అనుభవం కలిగిన స్టాఫ్‌నర్స్, ల్యాబ్ టెక్నీషియన్‌లు దగ్గరలో వుండాలి. వారి సమక్షంలో తనిఖీలు, రక్త సేకరణ చేపట్టాలి. తప్పులు చేస్తే సరిదిద్దాలి. సక్రమంగా చేసేలా చూడాలి. ఇప్పుడు వైద్యులు, అనుభవం కలిగిన సిబ్బందెవరూ లేకుండా తనిఖీలు, రోగ నిర్ధారణ పరీక్షలకు రక్త సేకరణ చేస్తుండడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
రెగ్యులరైజేషన్ కోరుతూ సమ్మె
సుమారు 16ఏళ్లుగా పారా మెడికల్ పోస్టులకు రెగ్యులర్ (శాశ్వత ప్రాతిపదికన) నియామకాలు లేకపోవడంతో అర్హత, అనుభవం కలిగిన పారామెడికల్ సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిన పనిచేయాల్సి వస్తోంది. సుదీర్ఘకాలంగా నిరంతర వైద్య సేవలు అందిస్తున్న అర్హులైన ప్రస్తుత కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నదే వీరి ప్రధాన డిమాండ్. పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలిపి శతశాతం గ్రాస్ జీతాన్ని అమలు చేయాలని అడుగుతున్నారు. 2018 నుంచి అమల్లోకి వచ్చిన వేతన తగ్గింపును సమీక్షించాలని కోరుతున్నారు. భవిష్యత్‌లో ఏర్పడే ఖాళీల భర్తీకి రెగ్యూలర్ నోటిఫికేషన్ విడుదల చేసే ముందు ప్రస్తుతం పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవాలని ఆశపడుతున్నారు. ఇలా మరికొన్ని డిమాండ్లును నెరవేర్చుకొనేందుకు రెండు రోజుల క్రితం సమ్మెబాట పట్టారు. అయితే సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖ షోకాజ్ నోటీస్‌లు జారీ చేస్తోంది. దీంతో అక్కడక్కడ కొంత మంది సమ్మె నుంచి వెనక్కి వస్తున్నట్లు తెలుస్తోంది.