Share News

ఉద్యోగుల సంబరం

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:15 AM

కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. ఏళ్లనాటి కలను నిజం చేసినందుకు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడంతో పాటు, కూటమికి అండగా ఉంటామని నినాదాలు చేశారు. రాష్ట్రంలో 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంతో ఉత్తరాంధ్ర పరిధిలోని ఉద్యోగులు ఆదివారం నగరంలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో కృతజ్ఞతాభినందన సభ ఏర్పాటు చేశారు.

ఉద్యోగుల సంబరం
ఉద్యోగులకు ఓపీఎస్‌ జీవో కాపీని అందిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

  • ఉద్యోగుల సంబరం

  • ఓపీఎస్‌ కల నిజం కావడంతో వేడుకలు

  • ‘స్వర్ణభారతి’లో కృతజ్ఞతాభినందన సభ

  • హాజరైన కూటమి నేతలు, ఎమ్మెల్సీలు

  • అందరికీ ఓపీఎస్‌ వచ్చేలా కృషి

  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

మద్దిలపాలెం, జూలై 19(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. ఏళ్లనాటి కలను నిజం చేసినందుకు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడంతో పాటు, కూటమికి అండగా ఉంటామని నినాదాలు చేశారు. రాష్ట్రంలో 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంతో ఉత్తరాంధ్ర పరిధిలోని ఉద్యోగులు ఆదివారం నగరంలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో కృతజ్ఞతాభినందన సభ ఏర్పాటు చేశారు.

సభకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏళ్లనాటి ఉద్యోగ, ఉపాధ్యాయుల కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసిందని, అందరికీ ఓపీఎస్‌ వర్తించేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు సక్రమంగా నడవాలన్నా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువకావాలన్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమంపై దృష్టిసారిస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లవచ్చనే విశ్వాసం కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియని, పనులు నిత్యం సాగాలన్నా, భవిష్యత్తు తరాలకు ఉత్తమ ఫలితాలు అందాలన్నా తరచూ ప్రభుత్వాలు మారకూడదన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉత్తమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు కొనసాగాలని కోరారు.

చరిత్రలో నిలిచే అంశం

ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌ చేయడం చరిత్రలో నిలిచే అంశమన్నారు. రాష్ట్రంలో 2019 నుంచి 2024వరకు దుర్మార్గపాలన సాగిందన్నారు. అనంతరం మూడు పార్టీల అద్భుత కలయికతో ప్రజలు ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలనను అంతమొందించి, మంచి ప్రభుత్వం రావడానికి తొలి అడుగువేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌ చేసినందుకు ఇంతమంది ఉద్యోగులు సభను ఏర్పాటు చేసి మరీ కృతజ్ఞతలు తెలిపి, హ్యాపీ సండేగా మార్చారన్నారు.

11 వేల కుటుంబాలకు లబ్ధి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడం ద్వారా 11 వేల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పించిందన్నారు. ఉపాధ్యాయ వేతనాలను రెవెన్యూ ఉద్యోగులకు సమానంగా పెంచిన ఘనతా స్వర్గీయ ఎన్టీఆర్‌దేనని తెలిపారు. 2004లో విధుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్‌ ఫ్యామలీ పెన్షన్‌, గ్రాట్యుటీ కల్పించిన ఘనతా చంద్రబాబుదేనని పేర్కొన్నారు. 2014లో సీపీఎస్‌ ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ ఇచ్చిన ఘనతా చంద్రబాబుదేనన్నారు. ఓపీఎస్‌ కోసం 22 ఏళ్లుగా పోరాడుతున్న వారి కలను నిజం చేసి, ఉత్తర్వులు ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి చంద్రాబాబేనని ఉద్యోగులు గుర్తుంచుకోవాలన్నారు. ఏ ముఖ్యమంత్రి పాలనలో తమ సంక్షేమం అమలవుతుందో ఆలోచించుకోవాలని సూచించారు. రాష్ట్రం సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చెందాలంటే స్థిరమైన పాలన అవసరమని, ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు, ఉపాఽద్యాయులు అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్సీలు అలపాటి రాజేంద్రప్రసాద్‌, కంచర్ల శ్రీకాంత్‌, పేరాబత్తుల రాజశేఖర్‌ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ విప్‌ వేపాడ చిరంజీవిరావు నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి కృషిచేస్తున్నామన్నారు.

మానాన్న కళ్లలో ఆనందం

పార్వతీపురం నుంచి వచ్చిన చిన్నారి అశ్విత మాట్లాడుతూ ఓపీఎస్‌లోకి వచ్చిన తన తండ్రి పదిహను రోజులుగా చాలా సంతోషంగా ఉన్నారని, ఎందుకంత సంతోషమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఆనందంగా జీవించవచ్చని చెప్పారని తెలిపింది. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నేతలు ఎం.శ్రీనివాసరావు, గోపీనాథ్‌, అప్పలరాజు, బలగ శ్రీనివాస్‌ హనుమంతురావు పెద్దసంఖ్యలో ఉత్తరాంధ్ర పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 07:47 AM