ఈఎంఐ ఉచ్చు
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:50 AM
ఫ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి నెల జీతం రూ 22 వేలు. తన సామా జిక హోదా కోసం పక్కంటి వారితో పోటీపడి రూ.60 వేల టీవీని, రూ.40 వేల ఫ్రిజ్‌ను ఈఎంఐలో తీసుకున్నాడు. నెలకు చెల్లించాల్సిన వాయిదాలే రూ.16 వేలు దాటాయి. మిగిలిన రూ.6 వేలతో ఇంటి అద్దె పిల్లల ఫీజు కట్టలేక నెలాఖరుకు వచ్చేసరికి బంధువుల వద్ద చేబదుళ్లు చేస్తున్నారు. వస్తువులు అయితే వచ్చాయి కానీ ఇంట్లో ప్రశాంతత పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి నెల జీతం రూ 22 వేలు. తన సామా జిక హోదా కోసం పక్కంటి వారితో పోటీపడి రూ.60 వేల టీవీని, రూ.40 వేల ఫ్రిజ్‌ను ఈఎంఐలో తీసుకున్నాడు. నెలకు చెల్లించాల్సిన వాయిదాలే రూ.16 వేలు దాటాయి. మిగిలిన రూ.6 వేలతో ఇంటి అద్దె పిల్లల ఫీజు కట్టలేక నెలాఖరుకు వచ్చేసరికి బంధువుల వద్ద చేబదుళ్లు చేస్తున్నారు. వస్తువులు అయితే వచ్చాయి కానీ ఇంట్లో ప్రశాంతత పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఫ భోగాపురం ప్రాంతానికి చెందిన యువకుడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రూ.2 లక్షల విలువైన స్పోర్ట్సు బైక్‌ను ఫైనాన్స్‌లో తీసుకున్నాడు. మూడు నెలలు సక్రమంగానే కట్టాడు కాని, తరువాత పని తగ్గడంతో వాయిదాలు చెల్లించలేక పోయాడు. ఫైనాన్స్ కంపెనీ ఆ యువకుడు బైక్‌ను తీసుకువెళ్లడంతో మనస్తానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఫ నగరంలోని ఓ కాలనీలో నివసించే మహిళ పక్కింటివారిని చూసి ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా టీవీ, వాషింగ్ మిషన్ కొనుగోలు చేసింది. భర్తకు తెలియకుండా చిన్న మొత్తాలే కదా అని మొదలు పెట్టింది. వడ్డీ మీద వడ్డీ పెరిగి ఆరు నెలల్లో రూ.3 లక్షలకు చేరింది. రికవరీ ఏజెంట్లు ఆమె ఫోన్ కాంటాక్ట్స్‌కు అందరికీ మేసేజ్‌లు పంపడంతో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
ఫ నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగికి నెల జీతం రూ.25 వేలు. ఇటీవల తన పెళ్లి కోసం సోషల్ మీడియాచూసి ఆడంబరాలకు పోయి ఫ్రీ వెడ్డింగ్ వీడియో, ఖరీదైన దుస్తుల కోసం రూ.5 లక్షల పర్సనల్ లోన్, ఈఎంఐల ద్వారా తీసుకున్నాడు. ఇప్పుడు నెలవారీ వాయిదాలే రూ.18 వేలు కట్టాల్సి వస్తుంది. ఇంటి అద్దె, నిత్యావసరాలకు కూడా డబ్బులు ల్లేక మళ్లీ అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫ ఒకప్పుడు అప్పు చేయా లంటే ఆరుగాలం ఆలోచించేవారు. నేడు జేబులో చిల్లిగవ్వ లేకపోయి నా కోరుకున్న వస్తువు ఇంటికి వచ్చేస్తుంది. ’సులభవాయిదాలు’ అంటూ ఊరిస్తున్న ఈఎంఐ (ఈ క్విటేడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంటు) వ్యవహారం జిల్లాలో సామాన్యుడి ఆర్థిక పునాదులను కదలిస్తున్నది. అవసరం లేకున్నా, ఆడంబరాల కో సం పాకులాడుతూ, ఆర్థిక క్రమశి క్షణ తప్పి వాయిదాల విషవలయం లో ప్రజలు చిక్కుకు పోతున్నారు.
విజయనగరం రింగురోడ్డు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం నుంచి పల్లెల వరకూ ఇప్పుడు ఎక్కడ చూసినా ‘0 పర్సెంట్ వడ్డీ’.. ‘నో డౌన్ పేమేంట్’ బోర్డులు కన్పిస్తున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజుల్లో వస్తున్న ఆఫర్లుకు మధ్య తరగతి ప్రజలు ఆకర్షితులౌతున్నారు. ముఖ్యంగా యువత, చిరుద్యోగులు, పేద, మధ్యతరగతి కుటుంబాలు వారు తమ ఆదాయానికి మించి ఖర్చులు చేస్తూ నెల నెల వచ్చేజీతాన్ని వాయిదాలకే సరిపెడుతున్నారు. గతంలో కార్లు, బైకులు, ఇతర ఎలకా్ట్రనిక్ వస్తువులకే పరిమితమైన ఈ వాయిదాల పద్ధతి ఇప్పుడు దుస్తుల వరకూ పాకింది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో బిల్లులు రూ.5 వేలు దాటితే చాలు అక్కడిక్కడే ఈఎంఐగా మార్చే ఆప్షన్ ఇస్తున్నారు. ఎలకా్ట్రనిక్ వస్తువులకు అయినా రీసేల్ వాల్యూ వుంటుంది కానీ బట్టలు ఒకసారి వాడితే సెకెండ్ హ్యాండ్‌లో రూపాయి కూడా రాదు. కానీ దానికోసం 6 నెలల నుంచి 9 నెలల పాటు వడ్డీతో కూడిన వాయిదాలు చెల్లిస్తూనే ఉన్నారు.
అప్పుల వెనుక సైకాలజీ ఇదే..
గతంలో వస్తువు కొనాలంటే డబ్బులు దాచుకునేవారు. ఇప్పుడు ముందు వాడుకో.. తరువాత కట్టుకో అనే సూత్రం జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది. దీనివల్ల వస్తువుల విలువ కంటే దాన్ని వాడుతున్నప్పుడు వచ్చే కిక్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఫ ఇనస్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ ఫొటోల కోసం ఖరీదైన బట్టలు, కార్లు, వెకేషన్ల కోసం అప్పులపాలవుతున్నారు.
ఫ డిజిటల్ చెల్లింపులు వల్ల చేతినుంచి నోట్లు బయటకు తీయని నేపథ్యంలో ఎంత వ్యయం అవుతున్నదో తెలియని పరిస్థితి నెలకొంటున్నది.
ఫ పొరుగింటి వారు కొత్త వస్తువు కొంటే మనకు అవసరం లేకపోయినా దాని కంటే మెరుగైనది కొనాలన్న ఈర్ష్య ఈ అప్పులకు పునాది ఏర్పడుతున్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
జిల్లాలో గణాంకాలు ఇలా..
జిల్లాలోని బ్యాంకింగ్ రంగాన్ని మార్కెట్ ట్రెండ్స్‌ని విశ్లేషిస్తే, షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. గత మూడేళ్లల్లో పర్సనల్ లోన్లు, కన్స్యూమర్ లోన్‌ల సంఖ్య 45 శాతం పెరిగింది. ఇందులో 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు యువతే ఎక్కువగా వుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్రాక్టర్లు, బైకుల రీ-పొసెషన్ (తిరిగి స్వాధీనం చేసుకోవడం) గత ఏడాదితో పోల్చితే 20శాతం పెరిగాయని చెబుతున్నారు. వాయిదాలు చెల్లించలేక సిబిల్ స్కోర్ దెబ్బతిన్న వారి సంఖ్య జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది 22శాతం పెరిగిందని చెబుతున్నారు. జిల్లాలో వందకు పైగా చిన్న, పెద్ద రికవరీ ఏజెన్సీలు ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్నాయి. అప్పును సక్రమంగా తీర్చలేని వారి దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేయడమే వీరి పని.
లాజిక్ ను మరచిపోతున్నారు..
ఏదైనా వస్తువుకు తీసుకున్న ఈఎంఐకి వడ్డీ లేదని చెప్పినా, ప్రొసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీల పేరుతో ముందే వేల రూపాయలు లాగేస్తున్నారు. వస్తువుకు ఇన్సూరెన్స్ పేరుతో అదనపు మొత్తాన్ని ఈఎంఐలో కలిపేస్తారు. ఒక్క రోజు వాయిదా ఆలస్యం అయినా, రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ ఆపరాధ రుసుం విధిస్తారు. ఇక్కడే ఫైనాన్స్ కంపెనీలకు లాభం వస్తుంది.
కొనేముందు ఆలోచించాల్సినవి..
ఈఎంఐ సమయానికి కట్టకపోవడంతో సిబిల్ స్కోరు పడిపోతే, భవిష్యత్తులో నిజంగా ఇళ్లు కట్టుకోవాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్న రూపాయి అప్పు ఇవ్వదు. ఏదైనా వస్తువుని ఈఎంఐ ద్వారా తీసుకునేట ప్పుడు అది మనకు ఎంత వరకూ ఉపయోగపడుతుంది? నిజంగా అవసరమా? అని బేరీజు వేసుకోవాలి. మున్ముందు వాయిదా సమయానికి చెల్లింపు జరగకపోతే వచ్చే పర్యావసనాలు ముందే ఊహించుకుని అప్పుడే కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి.
ఆర్థిక ఆక్షరాస్యత లేకపోవడమే..
ఆర్థిక అక్షరాస్యత చాలా మందిలో లేకపోవడమే ఈ సంక్షోభానికి మూలం అవుతుంది. అందుకే సంపాదనలో 50 శాతం ప్రధాన అవసరాలకు, 30 శాతం పొదుపునకు, 20 శాతం మాత్రమే ఇతరాలకు కేటాయించాలి. ఖరీదైన కార్లలో తిరుగుతూ, అప్పుల కుప్పలో వుండడం కంటే.. సైకిల్ మీద వెళ్తూ ప్రశాంతంగా నిద్రపోవడమే మేలు. ఎందుకంటే వాయిదాల పద్ధతి వస్తువును ఇస్తుంది. కానీ మీ ప్రశాంతతను దూరం చేస్తుంది. ఈ విషయాన్ని అందరూ తప్పక గమనించాలి.
-ఎం.రామారావు, ఛార్ట్‌డ్ అకౌంట్‌ంట్, విజయనగరం