history. నిర్మాణ నైపుణ్యానికి ప్రతిరూపాలు చరిత్రకు ఆనవాళ్లు
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:35 AM
Embodiments of architectural excellence and hallmarks of history. ప్రస్తుత రోజుల్లో ఎటువంటి భవనం నిర్మిస్తున్నా.. వాటి నాణ్యత ఏమేరకు ఉంటుందో, ఎంతవరకు మరమ్మతులకు గురికాకుండా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అయితే బ్రిటిష్ హయాంలో కట్టడాలు మాత్రం అందుకు భిన్నంగా దర్శన మిస్తున్నాయి. వందేళ్లు దాటినా నేటికీ ఎంతో పదిలంగా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలుగా వినియోగం
తోటపల్లి పూర్వ కాలువల నిర్మాణాలు నేటికీ పదిలమే
అప్పటి ఇంజినీర్ల నైపుణ్యానికి నిదర్శనాలెన్నో..
రేపు ఇంజనీర్స్ డే
పాలకొండ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత రోజుల్లో ఎటువంటి భవనం నిర్మిస్తున్నా.. వాటి నాణ్యత ఏమేరకు ఉంటుందో, ఎంతవరకు మరమ్మతులకు గురికాకుండా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అయితే బ్రిటిష్ హయాంలో కట్టడాలు మాత్రం అందుకు భిన్నంగా దర్శన మిస్తున్నాయి. వందేళ్లు దాటినా నేటికీ ఎంతో పదిలంగా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చరిత్రకు ఆనవాళ్లు... నాటి నిర్మాణ నైపుణ్యానికి ప్రతి రూపాలు జిల్లాలో చాలా ఉన్నాయి. శతాబ్దం దాటినా చెక్కుచెదరని భవనాలు, కోటలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాటిచెబుతున్నాయి. రేపు ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
డివిజన్ కేంద్రం పాలకొండలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరని విధంగా ఉన్నాయి. అప్పట్లో జమాబందీలు, పన్నుల వసూళ్లు, విడిది కేంద్రాలుగా ఆ భవనాలను ఆంగ్లేయులు వినియోగించేవారు. అయితే ప్రస్తుతం వాటిల్లో తహసీల్దార్ , సబ్ ట్రెజరీ , సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ప్రస్తుతం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం పక్కనే 20 ఏళ్ల కిందట మరో భవనం నిర్మించారు. అది నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.
తోటపల్లి పూర్వ కాలువలు
తోటపల్లి పూర్వపు కాలువల నిర్మాణం చేపట్టి 120 ఏళ్లు దాటింది. అయితే నేటికీ ఎటువంటి మరమ్మతులకు గురికాకపోవడం అప్పటి ఇంజనీరింగ్ పనితనానికి నిదర్శనం. ఎంతటి వరదలు వచ్చినా వాటిని తట్టుకుని నిలుస్తున్నాయి. అండర్ టన్నల్స్, అక్విడెక్ట్, షట్టర్లు తదితర నిర్మాణాలు నేటికీ ఎంతో పదిలంగా ఉన్నాయి.
ఆ చిమ్నీకి 106 ఏళ్లు
సీతంపేట: సీతంపేటలో బ్రిటిష్ పాలకుల ఆనవాళ్లు నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా 1917-1920 కాలంలో నిర్మించిన నీలిమందు తయారీ పొగ గొట్టం ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నాటి ఇంజనీర్ల గొప్పతనాన్ని చాటి చెబుతోంది. ఈ చిమ్నీని నిర్మించి సుమారు 106 ఏళ్లు గడుస్తున్నా నేటికీ చెక్కుచెదరకుండా ఉండడం గమనార్హం. సీతంపేటలో సుమారు 60 అడుగుల ఎత్తు, 4అడుగుల వెడల్పుతో స్థూపాకారంలో అప్పటి ఇంజనీర్లు సున్నం తో నిర్మించిన ఇండిగో(నీలిమందు)చిమ్నీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కాలక్రమంలో దాని చుట్టూనే ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ప్రాంతం పాలకొండ జమీందార్ల ఆధీనంలో ఉండేది. ఇక్కడ ఆంగ్లేయుల పాలన, సాంస్కృతిక ప్రభావం ఎక్కువగా ఉండడంతో వారి అవసరాల మేరకు సీతంపేటలో ఇండిగో ఫ్యాక్టరీని నిర్మించారని పురావస్తు శాస్త్రజ్ఞులు చేసిన అధ్యయనంలో తేలింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇండిగో ఫ్యాక్టరీ శిఽథిలావస్థకు చేరింది. అయితే ఫ్యాక్టరీ ఆనవాళ్లు తెలిపే ఈ చిమ్నీ ఇంకా ధృడంగా ఉండడంతో దీనిని పరీరక్షించి పర్యాటకుల సందర్శనార్థం అలానే ఉంచారు. ఇండిగో ఫిరా అనే ప్రజాతికి చెందిన నీలిమందు మొక్క ఆకులను బాగా ఉడికించి, వాటి ముద్దలను నీలిమందుగా తయారుచేసే క్రమంలో పొగ బయటకు పోయేందుకు ఈ చిమ్నీని అప్పట్లో వినియోగించే వారు. ఇలా తయారుచేసిన ఇండిగో నీలిమందును స్థానికంగా ఉపయోగించుకోవడమే కాకుండా ఇంగ్లాండ్‌కు ఎగుమతి చేసేవారు. ఇందుకోసం విజయనగరం జిల్లా బాడంగి మండలంలో బ్రిటిష్ పాలకులు తాత్కాలికంగా నిర్మించిన పాల్తేరు విమానాశ్రయాన్ని వినియోగించే వారని చరిత్ర చెబుతోంది. ఏదేమైనా ఈ చిమ్నీ అప్పటి ఇంజనీర్ల అద్భుత నిర్మాణాలకు, వారి నైపుణ్యాలకు అద్దం పడుతోంది. చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.