Share News

మక్కువకు తిరిగి వచ్చిన ఏనుగులు

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:23 PM

సాలూరు మండలంలో ఆదివారం సంచరించిన ఏనుగులు చుట్టూ తిరిగి సోమవారం మళ్లీ మక్కువ మండలంలోకి ప్రవేశించాయి.

మక్కువకు తిరిగి వచ్చిన ఏనుగులు
సీబిల్లి గ్రామ సమీప తోటల్లో సంచరిస్తున్న ఏనుగులు

మక్కువ రూరల్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): సాలూరు మండలంలో ఆదివారం సంచరించిన ఏనుగులు చుట్టూ తిరిగి సోమవారం మళ్లీ మక్కువ మండలంలోకి ప్రవేశించాయి. ఈ నెల మొదటి వారంలో డి.శిర్లాం, దబ్బగడ్డ, నగుళ్లు, మార్కొండపుట్టి ఎస్‌.పెద్దవలస గ్రామ పంచాయతీల పరిధిలో సంచరించిన ఏనుగులు తరువాత సాలూరు మండలంలోకి తరలిపోయాయి. అయితే సోమవారం ఉదయానికి ఏనుగులు మళ్లీ మక్కువ మండలంలోకి రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఎస్‌.పెద్దవలస, కాముడువలస, కొత్తకాముడువలస గ్రామాల్లో పామాయిల్‌, అరటి తోటలతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పైపులను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సీబిల్లి గ్రామ పరిధిలోని తోటల్లో తిష్ఠవేశాయి. రాత్రిసమయంలో అవి గ్రామాల్లోకి చొరబడకుండా ఫారెస్టు సిబ్బంది పహరా కాస్తున్నారు. గ్రామాల్లో చాటింపువేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సాలూరు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తవిటినాయుడు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Jun 15 , 2026 | 11:23 PM