పాలవలసలోనే ఏనుగుల తిష్ఠ
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:20 AM
పాలవలస ప్రాంతంలోనే ఏనుగుల తిష్ఠ వేశాయి.
భామిని, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పాలవలస ప్రాంతంలోనే ఏనుగుల తిష్ఠ వేశాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి మూడు రేకుల ఇళ్లు, కోళ్ల షెడ్‌ను ధ్వంసం చేసిన ఏనుగులు మంగళవారం రాత్రి కొండగిరి అర్జున్‌కు చెందిన తోటలోని రేకుల ఇంటిపై దాడి చేశాయి. ఇంటిలో నిల్వ ఉంచిన ధాన్యం, బియ్యం బస్తాలను బయటకు లాగి చెల్లాచెదురు చేశాయి. బుధవారం రాతి మరోసారి అదే ఇంటిపై దాడి చేసి మిగిలిన కందులు, బియ్యాన్ని ధ్వంసం చేశాయి. జిల్లా అటవీ అధికారి ప్రసన్న ఘటనా సలాన్ని గురువారం పరిశీలించి బాధిత గిరిజనులతో మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా తోటల్లో వ్యవసాయ పనుల కోసం రాత్రిపూట ఎవరూ ఉండవద్దన్నారు. ఏనుగుల దాడుల్లో నష్టపోయిన ఇళ్లు, ఆస్తులను పరిశీలించిన ఆమె బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమెతో పాటు అటవీశాఖాధికారులు సంజీవ్, మణి కంఠేశ్, రామకృష్ణ, కేశవ తదితరులున్నారు.