మక్కువను వదలని ఏనుగులు
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:53 PM
మక్కువ మండలాన్ని ఏనుగులు వదలడం లేదు. గత రెండు రోజులుగా ఇక్కడే తిష్ఠ వేశాయి.
- రెండు రోజులుగా ఈ మండలంలోనే తిష్ఠ
- పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతుల ఆందోళన
మక్కువ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మక్కువ మండలాన్ని ఏనుగులు వదలడం లేదు. గత రెండు రోజులుగా ఇక్కడే తిష్ఠ వేశాయి. ఎనిమిది గజరాజులు వివిధ గ్రామాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. వాటివల్ల ఎక్కడ తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జూన్, జూలైలో మక్కువ మండలంలో ఏనుగులు సంచరించాయి. వివిధ గ్రామాల్లో తిరుగుతూ మొక్కజొన్న, అరటి, పామాయిల్ తదితర పంటలను ధ్వంసం చేశాయి. రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. అయినా అటవీశాఖ అధికారులు ఎటువంటి నష్ట పరిహారం చెల్లించలేదు. ఆ తరువాత ఏనుగులు వేరే చోటకు వెళ్లిపోయాయి. అయితే, రెండురోజుల కిందట మళ్లీ మం డలంలోని డి.శిర్లాం పంచాయతీలోకి ప్రవేశించాయి. సోమవారం దబ్బగెడ్డ పంచాయతీలోని నగుళ్లు, విజయరామపురం, అనసభద్ర గామాల్లో సంచరించి అరటి, పామాయిల్, వరి, మొక్కజొన్న పంటలను నాశనం చేశాయి. మంగళవారం ఉదయం ఎర్రసామంతవలస, జగ్గుదొరవలస గ్రామాల్లో తిరుగుతూ పంటలను ధ్వంసం చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రానికి పనసభద్ర, జగ్గుదొరవలస గ్రామాల మధ్యలోని పామాయిల్ తోటల్లో సంచరిస్తూ తుండ, నంద గ్రామాల వైపుగా వెళ్తున్నట్లు రైతులు తెలిపారు. ఏనుగుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుంగా కేర్ టేకర్లను ఏర్పాటు చేశామని, ప్రజలెవరూ ఏనుగుల వద్దకు వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని సాలూరు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.