చినబుడ్డిడిలో ఏనుగుల బీభత్సం
ABN , Publish Date - May 14 , 2026 | 11:57 PM
అంకవరం పంచాయతీ చినబుడ్డిడి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
-నూర్పు యంత్రం, ట్రాక్టర్, బైక్ పాక్షికంగా ధ్వంసం
- పంటలకు తీవ్ర నష్టం
జియ్యమ్మవలస, మే 14 (ఆంధ్రజ్యోతి): అంకవరం పంచాయతీ చినబుడ్డిడి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామ సమీపంలో నిలిపిన వరి నూర్పు యంత్రం, ట్రాక్టర్, బైక్‌ను పాక్షికంగా ధ్వంసం చేశాయి. అంతటితో ఆగకుండా ధాన్యం బస్తాలను చిందరవందర చేశాయి. దీంతో బాధితులు శెట్టి పోలినాయుడు, కందుల సుదర్శనరావు లబోదిబోమంటున్నారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగరాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన తన సిబ్బందిని పంపించి పరిస్థితిని సమీక్షించారు. నష్ట పరిహారం అందేలా తగు చర్యలు తీసుకుంటానని రేంజ్ అధికారి గంగరాజు అన్నారు. ప్రస్తుతం గ్రామ సమీపంలోని మామిడి తోటల్లో ఏనుగులు తిష్ఠ వేశాయి. వీటిని ఇక్కడ నుంచి తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.