Share News

Elephants ఏనుగుల బీభ‌త్సం

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:43 PM

Elephant Rampage పాలవలసలో మళ్లీ గజరాజులు విరుచుకుపడ్డాయి. సోమవారం రాత్రి అదే గ్రామంలోని జీడి తోటలో మూడు రేకుల ఇళ్లు, కోళ్ల షెడ్‌ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం రాత్రి కూడా ఆ ప్రాంతంలో కొండగొర్రె అర్జున్‌కు చెందిన రేకుల ఇంటిపై నాలుగు ఏనుగులు దాడి చేశాయి. నిల్వ ఉంచిన ధాన్యం, బియ్యం బస్తాలను బయటకు లాగి చెల్లాచెదురుగా పడేశాయి. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

 Elephants ఏనుగుల బీభ‌త్సం
పాలవలస గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు

  • రేకుల ఇంటిపై దాడి..

  • భయాందోళనలో గిరిజనులు

భామిని, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): పాలవలసలో మళ్లీ గజరాజులు విరుచుకుపడ్డాయి. సోమవారం రాత్రి అదే గ్రామంలోని జీడి తోటలో మూడు రేకుల ఇళ్లు, కోళ్ల షెడ్‌ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం రాత్రి కూడా ఆ ప్రాంతంలో కొండగొర్రె అర్జున్‌కు చెందిన రేకుల ఇంటిపై నాలుగు ఏనుగులు దాడి చేశాయి. నిల్వ ఉంచిన ధాన్యం, బియ్యం బస్తాలను బయటకు లాగి చెల్లాచెదురుగా పడేశాయి. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కాగా బుధవారం ఉదయం ఇంటిని పరిశీలించి బాధితులు లబోదిబోమన్నారు. ఈ విషయం తెలుసుకున్న పాలకొండ రేంజ్‌ అటవీ అధికారి పి.లక్ష్మీనర్సు , ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి రామకృష్ణ, బీట్‌ ఆఫీసర్‌ కేశవ తదితరులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గజరాజలు దాడిపై ఆరా తీశారు. అనంతరం బాధిత కుటుంబంతో మాట్లాడారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో తోటల్లో ఎవరూ ఉండరాదని సూచించారు. గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. బాధితులకు నష్టపరిహారం అందించేందుకు గాను ఉన్నధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. కాగా గ్రామంలోకి తొలిసారి వచ్చిన ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని, తక్షణమే వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:43 PM