Share News

Electric Wire విద్యుత్‌ తీగే.. యమపాశమై

ABN , Publish Date - Oct 31 , 2026 | 10:23 PM

Electric Wire Turns Deadly ఆవులను మేతకు తీసుకెళ్లిన ఆమెను విద్యుత్‌ తీగ యమపాశమై కాటేసింది. దీంతో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఇంటి దీపం ఆరిపోవడంతో భర్త, పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.

Electric Wire  విద్యుత్‌ తీగే.. యమపాశమై
బిడ్డిక పెంటమ్మ (ఫైల్‌)

  • ఆవులను మేత కోసం తీసుకెళ్లి తిరిగిరాని లోకాలకు

  • శోకసంద్రంలో కుటుంబసభ్యులు

  • విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంపై మండిపాటు

సీతంపేట, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఆవులను మేతకు తీసుకెళ్లిన ఆమెను విద్యుత్‌ తీగ యమపాశమై కాటేసింది. దీంతో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఇంటి దీపం ఆరిపోవడంతో భర్త, పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

హడ్డుబంగి గ్రామానికి చెందిన బిడ్డిక కృష్ణారావు, పెంటమ్మ(42) వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాగా రోజూలాగానే పెంటమ్మ శనివారం ఆవులను మేత కోసం బయటకు తీసుకెళ్లింది. గ్రామ సమీపంలో ఉన్న సిక్కింగూడకి వెళ్లే మార్గంలో పశువులను మేతకు విడిచిపెట్టింది. ఈ క్రమంలో ఆవులను అక్కడి నుంచి తరిమేందుకు ముందుకు వెళ్లింది. అప్పటికే పొదల్లో తెగిపడి ఉన్న విద్యుత్‌ వైరు ఆమెకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెంటమ్మకు సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెంటమ్మ అకాల మృతితో భర్త , పిల్లలు గుండెలవిసేలా రోధించారు. మరోవైపు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. దీనిపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వై.అమ్మన్నరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సరిచేయాలని కోరినా..

సిక్కింగూడ గ్రామానికి వెళ్లే మార్గంలోని విద్యుత్‌ తీగ కిందకు వేలాడుతుందని, దీనిని సరిచేయాలని గతంలో ఎన్నోసార్లు సంబంధిత విద్యుత్‌శాఖ సిబ్బందికి కోరినా ఎవరూ పట్టించుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు ప్రభుకుమార్‌, రాజారావు తెలిపారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం వల్లే మహిళ మృతిచెందిందని వారు ఆరోపించారు. దీనిపై ట్రాన్స్‌కో ఏఈ నీలిమని వివరణ కోరగా.. ‘ ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆ మార్గంలో ఉన్న విద్యుత్‌ స్తంభం పక్కకు ఒరిగి.. వైరు తెగిపడి ఉంటుంది. దీనిని గమనించకపోవడం మూలంగా ఈ ప్రమాదం జరిగింది.’ అని ఆమె చెప్పారు. తుఫాన్‌ ప్రభావంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాద్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 10:23 PM