ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:02 PM
సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులకు సూచించారు.
- జిల్లాలో 20 వేల మందిపై బైండోవర్ కేసులు
- ఎస్పీ దామోదర్
శృంగవరపుకోట/వేపాడ/లక్కవరపుకోట/ అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి) : సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులకు సూచించారు. శనివారం ఆయన శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపు కోట మండలాల్లో పర్యటించారు. వేపాడలో ఆయన అధికారులతో మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ పూర్తయినా స్ర్కూట్నీ తదితర ప్రక్రియల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా చూసుకోవాలన్నారు. అనంతరం వల్లంపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో 20వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఎల్.కోట పోలీసు స్టేషన్, మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు ఎన్నికల్లో అధికారులు, ప్రజలు పోలీసుల సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు. నిరంతరం నిఘా వ్యవస్థ పనిచేస్తుందని, ప్రజలంతా ధైర్యంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎస్.కోట మండలం బొడ్డవర వరలక్ష్మి పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. పోలీస్ బందోబస్తు, భద్రత ఏర్పాట్లను చూశారు. ఎన్నికల విధుల్లో సంయమనం పాటించాలని, దాడులకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీఐలు ఏవీ లీలారావు, వి.నారాయణ మూర్తి, ఎల్.హిమగిరి, ఎస్‌ఐలు జోగారావు, సుదర్శన్, రామకృష్ణ, లక్ష్మణరావు, వేపాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి భానులత, తహసీల్దార్ రాములమ్మ, ఎంపీడీవో సూర్యనారాయణ
యువత గంజాయి, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి
గంజాయి, బెట్టింగ్, పోక్సో కేసులకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ దామోదర్ సూచించారు. వేపాడ మండలం వల్లంపూడి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటుందని అన్నారు. మనకు అమ్మ జన్మనిస్తే.. హెల్మెట్ పురర్జన్మనిస్తుందన్నారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలన్నారు. ఎవరైనా గంజాయికి అలవాటు పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాంటి వారిని అదుపులోకి తీసుకొని, చికిత్స చేయించి మంచి ఆరోగ్యవంతులుగా మార్చి భవిష్యత్తు ఇస్తామన్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికల భద్రత తమ ప్రధాన కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో ఎస్.కోట రూరల్ సీఐ హిమగిరి, వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్ పోలీసులు, విద్యార్థులు, పలువురు పెద్దలు పాల్గొన్నారు.