Elections are coming!ఎన్నికలు వస్తున్నాయ్!
ABN , Publish Date - Jun 19 , 2026 | 11:57 PM
Elections are coming! స్థానిక ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం ఆసక్తితో ఉంది. హైకోర్టులో దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణలో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కుటుంబ సర్వే పూర్తికావడం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సైతం ప్రారంభం కావడం, బీసీ రిజర్వేషన్‌పై నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక రానుండడంతో..రోజుల వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తితో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. ఏ రోజైనా స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్నికలు వస్తున్నాయ్!
సిద్ధంగా ఉన్నామన్న కూటమి
ముందుగా పంచాయతీలకే చాన్స్
తరువాత మునిసిపాల్టీలకు.. చివరిగా ప్రాదేశికాలకు నిర్వహించే అవకాశం
కూటమిలో దూకుడు.. వైసీపీలో నైరాశ్యం
స్థానిక ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం ఆసక్తితో ఉంది. హైకోర్టులో దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణలో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కుటుంబ సర్వే పూర్తికావడం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సైతం ప్రారంభం కావడం, బీసీ రిజర్వేషన్‌పై నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక రానుండడంతో..రోజుల వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తితో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. ఏ రోజైనా స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
విజయనగరం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సమరంలో ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.16 వేల కోట్లకుపైగా కేటాయించింది. ఇవి సవ్యంగా రావాలంటే పంచాయతీలకు పాలకవర్గాలు ఉండాలి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను పూర్తిచేయాలన్న తలంపులో కూటమి ప్రభుత్వం ఉంది. మునిసిపాల్టీల పాలకవర్గాల గడువు మార్చి 17తో ముగిసింది. ఆర్డీవో స్థాయి అధికారులను ప్రత్యకాధికారులుగా నియమించారు. అటు సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్ 4తో ముగిసింది. వాటికి సైతం ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. ఈ నెలతో ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం కూడా ముగియనుంది. వాటికి సైతం ప్రత్యేకాధికారుల నియమాకం జరగనుంది. అయితే మునిసిపాల్టీలకు ప్రత్యేకాధికారులను నియమించి నాలుగు నెలలు సమీపిస్తోంది. పంచాయతీలకు మూడు నెలలు అవుతోంది. స్థానిక సంస్థలకు సంబంధించి పాలకవర్గాలు ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఈ పరిస్థితిలో వీలైనంత తొందరగా ఎన్నికల సమరంలోకి దిగాలని కూటమి భావిస్తోంది.
కూటమిలో ఉత్సాహం..
జిల్లాలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. మూడు పార్టీల మధ్య పొత్తు, సమన్వయం బాగున్నాయి. నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే ఉండగా అక్కడ చిన్నచిన్న ఇబ్బందులే ఉన్నాయి. మిగతా చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ సమన్వయంతో ముందుకు సాగుతోంది. పంచాయతీ ఎన్నికల వరకూ ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ ప్రాదేశిక, మునిసిపల్ ఎన్నికల్లో మాత్రం సీట్ల సర్దుబాటు, టిక్కెట్ల కేటాయింపులో చిన్నపాటి ఇబ్బందులు రావొచ్చునని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తమ కేడర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కూటమి కోసం సమన్వయంతో వ్యవహరించడమే కాదు.. అవసరమైతే త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడంతో రెండు పార్టీల కేడర్లు సర్దుబాటు ధోరణిలో ముందుకెళుతున్నాయి.
నిరాశలో వైసీపీ
వైసీపీలో మునుపటి జోష్ లేదు. కీలక నేతలున్న చోటే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. గ్రామస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. 2021లో అధికారంలో ఉన్నప్పుడు తాము వ్యవహరించిన తీరును వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పైగా అధికారంలో లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినా పెద్దగా ఉపయోగమేమీ ఉండదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలూ ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అధినేత జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఇన్‌చార్జి పోస్టు నుంచి మార్చేస్తానని హెచ్చరించారు. దీంతో ఏదో పోటీ అన్నట్టు..గెలవకపోయినా అభ్యర్థులను నిలబెట్టేందుకు చూస్తున్నారు.
స్థానిక సంస్థలిలా..
జిల్లాలో పంచాయతీలు 776 ఉన్నాయి. 7,328 వార్డు స్థానాలు ఉన్నాయి. 12,83,475 మంది ఓటర్లు ఉన్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో 80 శాతం వరకూ వైసీపీ గెలుచుకుంది. అప్పట్లో బెదిరింపుల పర్వానికి దిగారని సర్వత్రా వినిపించిన మాట. ఈసారి మాత్రం టీడీపీ కూటమి ఏకపక్షంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. ఉమ్మడి జిల్లాగానే జిల్లా పరిషత్ ఉంది. ఒకవేళ విభజించి ఎన్నికలు నిర్వహిస్తామంటే 27 మండలాల వరకే చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీలకు సంబంధించి 549 ఉన్నాయి. 2021 ఎన్నికల్లో 400కుపైగా స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూటమి గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో వైసీపీ జడ్పీటీసీ స్థానాలను సైతం ఏకగ్రీవం చేసుకుంది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలకు ప్రయత్నించాలనుకుంటోంది.
- జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయతీ ఉంది. విజయనగరం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. విభజనతో వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మిగతా మునిసిపాల్టీల్లో 110 వార్డులు ఉన్నాయి. వీటి సంఖ్య సైతం పెరిగే అవకాశం ఉంది.
-------------------