Elections are coming.ఎన్నికలు వచ్చేస్తున్నాయ్
ABN , Publish Date - May 12 , 2026 | 12:19 AM
Elections are coming.స్థానిక సంస్థల ఎన్నికల సందడి అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ వైపుగా ప్రభుత్వం సన్నాహాల్లో తలమునకలైంది. ఏ రోజైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఎన్నికలకు సంబంధించి కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారు.
ఎన్నికలు వచ్చేస్తున్నాయ్
స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి
సన్నాహాలపై కలెక్టర్లకు సీఎం సూచనలు
ముందుగా పంచాయతీలకు?
ఆశావహుల్లో మొదలైన సందడి
విజయనగరం, మే 11 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికల సందడి అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ వైపుగా ప్రభుత్వం సన్నాహాల్లో తలమునకలైంది. ఏ రోజైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఎన్నికలకు సంబంధించి కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారు. అమరావతిలో ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో స్థానిక సంస్థల ఎన్నికలపై వారితో మాట్లాడారు. అయితే ముందుగా పంచాయతీలకా? లేకుంటే మునిసిపల్ ఎన్నికలకు వెళతారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే మునిసిపాల్టీల పాలకవర్గాల గడువు మార్చి 17తో ముగిసింది. ఆర్డీవో స్థాయి అధికారులను ప్రత్యకాధికారులుగా నియమించారు. అటు సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్ 4తో ముగిసింది. వాటికి సైతం ప్రత్యేకాధికారుల నియామకం పూర్తయ్యింది. సెప్టెంబరులో ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగియనుంది. వాటికి సైతం ప్రత్యేకాధికారుల నియమాకం జరగనుంది. అయితే మునిసిపాల్టీలకు ప్రత్యేకాధికారులను నియమించి రెండు నెలలు సమీపిస్తోంది. పంచాయతీలకు నెల దాటింది. పాలకవర్గాలు ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఈ నిబంధన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నేరుగా కలెక్టర్ల సదస్సుల్లో ఆదేశాలు ఇచ్చేసరికి ఎన్నికల ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
మునిసిపాల్టీల్లో వార్డుల విభజన..
మున్సిపాల్టీల్లో వార్డుల విభజన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయతీ ఉంది. కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. విభజనతో వాటి సంఖ్య 62కి పెరిగే అవకాశం ఉంది. మిగతా మునిసిపాల్టీల్లో 110 వార్డులు ఉన్నాయి. వీటి సంఖ్య సైతం పెరుగుతుంది. వార్డుల విభజన ప్రక్రియ ప్రస్తుతం చురుగ్గా జరుగుతోంది. పెరిగిన డివిజన్లు, వార్డులపై ఈ నెల 17న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 17 నుంచి 27 వరకూ వాటిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్‌లో గజిట్ ఇవ్వనున్నారు.
పంచాయతీ పోరు..
జిల్లాలో పంచాయతీలు 776 ఉన్నాయి. డివిజన్ల వారీగా పరిశీలిస్తే బొబ్బిలి డివిజన్ పరిధిలో 206, విజయనగర్ డివిజన్‌లో 327, చీపురుపల్లి డివిజన్‌లో 243 పంచాయతీలు ఉన్నాయి. ఒకవేళ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం మొగ్గుచూపితే మాత్రం డివిజన్ల వారీగా పోలింగ్ జరిపి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ 776 పంచాయతీల పరిధిలో 7,328 వార్డు స్థానాలు ఉన్నాయి. 12,83,475 మంది ఓటర్లు ఉన్నారు.
మండల, జిల్లా పరిషత్‌లకు..
మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశికాలకు సంబంధించి ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. ఉమ్మడి జిల్లాగానే జిల్లా పరిషత్ ఉంది. ఒకవేళ విభజించి ఎన్నికలు నిర్వహిస్తామంటే 27 మండలాల వరకూ చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీలకు సంబంధించి 549 స్థానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీ గణన అడ్డంకిగా ఉంది. ఇప్పటికే ఆ సమస్య పరిష్కారానికి ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. కమిషన్ గడువు ముగియనుంది. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సంకేతాలు ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
------------------