election time హోరు.. జోరు
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:25 AM
election time కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. దీంతో మైక్ సెట్లు, డప్పు కళాకారులు, ప్రచార రథాలకు భారీగా డిమాండ్ పెరిగింది. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు అవసరమైన ప్లెక్సీలు, కరపత్రాల ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్‌లు రాత్రీపగలు పనిచేస్తున్నాయి.
హోరు.. జోరు
మైకులు, డప్పు కళాకారులు, ప్రచార రథాలకు పెరిగిన డిమాండ్
ఫ్లెక్సీలు, కరపత్రాల ముద్రణ కోసం పడిగాపులు
కిటకిటలాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు
విజయనగరం కలెక్టరేట్/రింగురోడ్డు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి):
కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. దీంతో మైక్ సెట్లు, డప్పు కళాకారులు, ప్రచార రథాలకు భారీగా డిమాండ్ పెరిగింది. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు అవసరమైన ప్లెక్సీలు, కరపత్రాల ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్‌లు రాత్రీపగలు పనిచేస్తున్నాయి. ఈ రంగాల వారికి చేతి నిండా పని దొరికింది. మద్యం దుకాణాలు, పెట్రోలు బంకులు, రెస్టారెంట్ల వ్యాపారాలు మూడింతలు పుంజుకున్నాయి. అభ్యర్థుల తరపున ప్రచారం కోసం వచ్చేవారికి పెట్రోలు కూపన్లు అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి సమయంలో వందలాదిగా బిర్యానీ ప్యాకెట్లకు ఆర్డర్లు ఇస్తున్నారు. దీంతో క్యాటరింగ్ వ్యాపారులు బిజీ అయిపోయారు.
- సాయంత్రం 6గంటలు దాటితే చాలు మద్యం దుకాణాలు వద్ద అసలైన హంగామా కన్పిస్తోంది. రోజువారీ ప్రచారంతో అలిసిపోయిన కార్యకర్తలకు సాయంత్రం వేళ మందు, విందు సమకూర్చడం పరిపాటిగా మారింది. ఫలితంగా సాధారణ రోజులు కంటే మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి.
- ఓట్ల వేటలో అభ్యర్థులు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆలయాల్లో హోమాలు, ప్రత్యేక పూజలు చేయిస్తూ స్వామివారికి భారీగా మొక్కులు చెల్లించుకుంటున్నారు.
డిమాండ్ పెరిగింది
సాధారణంగా రోజుల్లో ఒక మైక్ సెట్‌కు రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వస్తే ఎన్నికల సీజన్‌లో రూ.3000 నుంచి రూ.5000 వరకూ అద్దె లభిస్తోంది. హెవీ డిజిటల్ సౌండ్ సిస్టమ్స్ కోసం రోజుకు రూ8000 చెల్లిస్తున్నారు. పెట్రోల్, డ్రైవర్ చార్జీలు, కుర్రాళ్లకు కూలి ఖర్చులను అభ్యర్థులే చూసుకుంటున్నారు. ఈ ఎన్నికలతో మా ఆర్థిక కష్టాలు తీరుతాయి.
- రమేష్, సౌండ్ సిస్టమ్ నిర్వాహకుడు
డప్పు ప్రత్యేకతే వేరు
ఎన్ని డీజేలు వచ్చినా ఎన్నికల ప్రచారంలో డప్పు వాయిద్యానికి ఉన్న ప్రాధాన్యం తగ్గలేదు. డప్పు దరువుతోనే ఓటర్లకు ఉత్సాహం వస్తుంది. ఎన్నికల వేళ ప్రాచీన కళకు దక్కుతున్న ఈ ఆదరణ, ఈ గౌరవం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. సాధారణ రోజుల్లో రోజంతా పని చేస్తే రూ.500 నుంచి రూ.800 ఇచ్చేవారు. ఇప్పుడు రోజుకు రూ.1500 నుంచి రూ.2500 అందిస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నాం భోజనం, రవాణా ఖర్చులను అభ్యర్థులే చూసుకుంటున్నారు.
- రాంబాబు, డప్పు కళాకారుడు
---------------