పారదర్శకంగా ఎన్నికల విధులు
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:16 AM
Election Duties to Be Conducted Transparently జిల్లాలో అధికారులు, సిబ్బంది.. పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సాధారణ పరిశీలకులు ఎస్.చిన్నరాముడు సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియలో నిబంధనలు పాటించాలన్నారు.
పార్వతీపురం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అధికారులు, సిబ్బంది.. పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సాధారణ పరిశీలకులు ఎస్.చిన్నరాముడు సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియలో నిబంధనలు పాటించాలన్నారు. సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన బుక్లెట్లు, మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ చదుకోవాలని సూచించారు. ఏ చిన్న సందేహం ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. నామినేషన్ పత్రంలో ప్రతిపాదకుల సంతకాలు, వారి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ముందే పరిశీలించుకోవాలని తెలిపారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల విధులపై పూర్తి అవగాహన ఉండాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈవీఎంల నిర్వహణ, ప్రాసెస్‌పై ముందస్తు సన్నాహాలు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జేసీఆర్.వైశాలి, సబ్ కలెక్టర్ సచిన్ అర్పిత్ రహార్, డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.
పక్కాగా కోడ్ అమలు : కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లరాదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతులను ముందుగానే ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రచార సభలు, ర్యాలీలు, ఊరేగింపులకు అభ్యర్థులు తప్పనిసరిగా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. లౌడ్స్పీకర్లు వినియోగం, గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడం, లంచాలు లేదా బహుమతులు అందించడం, మద్యం పంపిణీ, కులం, మతం ఆధారంగా ఓట్లు కోరడం వంటి చర్యలకు పాల్పడరాదన్నారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ప్రచారం నిషేధమని తెలిపారు. ఓటర్లను అక్రమంగా తరలిచడం, దొంగ ఓట్లు వేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ భవనాలు, వాహనాలు, సిబ్బంది, నిధులను రాజకీయ ప్రయోజనాలు కోసం వినియోగించరాదని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఇన్చార్జి జేసీ ఆర్.వైశాలి, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ , డీఆర్వో కె.హేమలత, డీపీవో రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.