బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:57 PM
రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంతో పాటు నిలుచుని ఉన్న వృద్ధుడిని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది.
కొత్తవలస, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంతో పాటు నిలుచుని ఉన్న వృద్ధుడిని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీఐ టీవీ విజయ్‌కుమార్ అందించిన వివరాలు ఇలాఉన్నాయి. కొత్తవలస పంచాయతీ అర్దానపాలెం గ్రామానికి చెందిన పెదిరెడ్ల సముద్రం(60) సోమవారం ఉదయం గొల్లపేట గ్రామ జంక్షన్ వద్ద రోడ్డు పక్కన తన ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేసి, ఎడమ వైపు నిల్చుని ఉన్నాడు. అదే సమయంలో విజయనగరం నుంచి కొత్తవలస వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతన్ని ఢీకొట్టి, అనంతరం అదుపు చేయలేక కుడి వైపు ఉన్న కారును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఎవరూ లేరు. కారుతో పాటు వృద్ధుడిని సుమారు 50 అడుగుల వరకు ఈడ్చుకుపోయింది. అలాగే బస్సు చక్రం వృద్ధుడి తలపై నుంచి వెళ్లిపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సముద్రం పాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబ పోషిస్తున్నాడు. సము ద్రం భార్య పెదిరెడ్ల లక్ష్మి కొత్తవలస ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా.. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. మృతుడి కుమారుడు పెదిరెడ్ల కనకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిమిత్తం ఎస్‌ఐ జోగారావుకు అప్పగించినట్టు సీఐ తెలిపారు. సోమవారం పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.