El Niño tension ఎల్‌నినో కలవరం
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:19 AM
El Niño tension ఖరీఫ్ సాగుపై అన్నదాత అయోమయ పరిస్థితిలో పడ్డాడు. ప్రధానంగా ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్, జూలై నెలలను పరిశీలిస్తే లోటు వర్షం కురిసింది. ఆశతో వరి నారు పోసుకున్న రైతులు ఇప్పుడు వర్షాలు కురవకపోవడంతో వరి నారును బిందెలతో తడుపుతూ బతికించుకుంటున్నారు. మరోవైపు రిజర్వాయర్లలో కూడా కనీస స్థాయిలో నీటి మట్టాలు లేవు. చెరువుల్లోనూ నీరు చేరలేదు. ఈసారి ముందే కరువు పరిస్థితులు కన్పిస్తున్నాయి.
ఎల్‌నినో కలవరం
ఖరీఫ్ సాగుపై అన్నదాతలో అయోమయం
ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయంటున్న వాతావరణ శాఖ
ఇప్పటికే జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు
రిజర్వాయర్లలో పెరగని నీటి మట్టాలు
ఆరు తడి పంటలు వేసుకోవాలంటున్న శాస్త్రవేత్తలు
రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ
ఖరీఫ్ సాగుపై అన్నదాత అయోమయ పరిస్థితిలో పడ్డాడు. ప్రధానంగా ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్, జూలై నెలలను పరిశీలిస్తే లోటు వర్షం కురిసింది. ఆశతో వరి నారు పోసుకున్న రైతులు ఇప్పుడు వర్షాలు కురవకపోవడంతో వరి నారును బిందెలతో తడుపుతూ బతికించుకుంటున్నారు. మరోవైపు రిజర్వాయర్లలో కూడా కనీస స్థాయిలో నీటి మట్టాలు లేవు. చెరువుల్లోనూ నీరు చేరలేదు. ఈసారి ముందే కరువు పరిస్థితులు కన్పిస్తున్నాయి.
గంట్యాడ, జూలై 11(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో దాదాపు లక్షా 80 వేల హెక్టార్లలో రైతులు వివిధ పంటలను ఏటా సాగు చేస్తున్నారు. అందులో 90 వేల హెక్టార్ల వరకూ వరి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈనెల మొదటివారంలో కురిసిన వర్షానికి రైతులు వరి నారు వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు వాన పడినా కూడా కనీస స్థాయిలో నమోదు కాలేదు. ఆశతో నారు వేసుకున్న రైతులు ఇప్పుడు వాటిని బతికించుకునే పనిలో పడ్డారు. జిల్లాలో జూన్ మొదటి నుంచి ఇప్పటి వరకూ -16 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. వంగరలో -56, రేగిడిలో -44, సంతకవిటిలో -72, బొబ్బిలిలో -18, ఆర్‌బిపురంలో -37, మెరకముడిదాంలో -29, తెర్లాంలో -26, గంట్యాడలో -33, ఎస్.కోటలో -18, కొత్తవలసలో -65,పూసపాటిరేగలో -44,డెంకాడలో -31, భోగాపురంలో -45 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది.
ఎల్‌నినో ప్రభావం
ఎల్‌నినో అంటే పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి భారత్‌లో రుతుపవనాలు బలహీన పడటం. అదే సమయంలో ఉత్తర హిందూ మహాసముద్రంలో బలమైన, సుదీర్ఘ వేడి గాలులు ఏర్పడతాయని వాతావరణ విభాగం చెబుతోంది. ఇవి పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్టోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఎల్‌నినో ప్రారంభమైందని ఐఎండీ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ తటస్థ పరిస్థితులు ఉండగా తాజాగా ఎల్‌నినోగా మారిందని వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి వరకూ ఈ పరిస్థితులు కొనసాగుతాయి. బలమైన ఎల్‌నినో సూపర్ ఎల్‌నినోగా మారే ప్రమాదమూ ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఐఎండీ అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం 92 నుంచి 94 శాతానికి పరిమితం కావచ్చు.
తేలిక పాటి పంటలు మేలు
ఎల్‌నినో ప్రభావం వల్ల తేలిక పాటి పంటలు వేసుకోవడం మంచిదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, ప్రత్తి, కూరగాయల్లో వంగ, టమోటా, బెండ, చిక్కుడు మొదలైన పంటలు వేసుకోవాలి. అలాగే నేల ప్రకారం పంటలను ఎంచుకోవాలి. తక్కువ నీటితో పండే పంటలతోపాటు కరువును తట్టుకునే విత్తనాలు ఎంపిక చేసుకోవడం మంచింది. సజ్జలు, రాగులు, కొర్రలు, చిరుధాన్యాలు, కందులు, పెసలు వంటి పంటలు సాగు చేయడం శ్రేయస్కరం.
సాగు ప్రణాళికలో మార్పులు
వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున స్వల్పకాలిక పంటలను విత్తుకోవాలి. రసాయన ఎరువుల వాడకం తగ్గించి నేల తేమను నిలుపుకొనేలా సహజ వ్యవసాయ పద్ధతులు పాటించాలి. బిందుసేద్యం, స్ర్పింక్లర్ల సేద్యం వంటి పద్ధతుల ద్వారా నీటి వృథాను అరికట్టాలి. ఉష్ణోగ్రతలు పెరిగితే రసం పురుగుల ఉధృతి పెరుగుతుంది. నిరంతరం పంటను గమనిస్తూ పురుగుల నివారణ చర్యలు తీసుకోవాలి. కరువు సమయంలో పశువులకు గడ్డి కొరత రాకుండా ముందస్తుగా పశుగ్రాసం పెంచుకోవడం, నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఎల్‌నినో ప్రభావం కాస్త తక్కువగా ఉండవచ్చు
ఎల్‌నినో ప్రభావం జిల్లాకు కాస్త తక్కువగా ఉండవచ్చు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నాట్లుకు బదులుగా వరిని ఎద పద్ధతిలో వేసుకోవడం చాలా ఉత్తమం. కొన్ని మండలాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. కనీస స్థాయిలో వర్షాలు కురవని మండలాలు కూడా ఉన్నాయి. ఇటువంటి చోట్ల రైతులు ముందుచూపుతో సాగు చేయాలి.
వీటీ రామారావు, జేడీ, జిల్లా వ్యవసాయ శాఖ
తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గడం., ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు నెలకొంటాయి. ఏపీ తీర ప్రాంతాల్లో ఆ ప్రభావాన్ని తట్టుకోవడానికి ప్రణాళికతో పంటలు వేసుకోవాలి. తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి. వరిలో సాంబమసూరి, స్వర్ణ, విజేత, తరంగిణి, సుజాత, మారుటేరు సాంబ, ఎంటీయు 1293, ఎన్‌ఎల్‌ఆర్ 1293 వంటి వంగడాలు ఎంచుకోవాలి. మొక్కజొన్న, ప్రత్తితో పాటు కూరగాయల పంటల్లో వంగ, టమోటో, బెండ, చిక్కుడు మొదలైన పంటలు వేసుకోవాలి.
- కె.లక్ష్మణరావు, ప్రధాన శాస్త్రవేత్త