Unstoppable Worker ఎనిమిది పదుల వయసు.. అలుపెరగని శ్రామికుడు
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:03 AM
Eight Decades Old, Yet an Unstoppable Worker వయసు అనేది ఆయనకు ఒక సంఖ్య మాత్రమే. ఎనిమిది పదులు దాటినా.. నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగుతున్నాడు పాలకొండ పట్టణానికి చెందిన కోట్ల దుర్గారావు. తన 21వ ఏట నుంచే రోజువారీ కూలీగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
సైకిల్‌తో పరుగులు తీస్తూ.. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న వైనం
నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం
పాలకొండ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): వయసు అనేది ఆయనకు ఒక సంఖ్య మాత్రమే. ఎనిమిది పదులు దాటినా.. నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగుతున్నాడు పాలకొండ పట్టణానికి చెందిన కోట్ల దుర్గారావు. తన 21వ ఏట నుంచే రోజువారీ కూలీగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 15 ఏళ్ల పాటు బంగారు ఆభరణాల తయారీ షాపులో , మరో పదేళ్ల పాటు ఎంపీడీవో కార్యాలయంలో బాయ్‌గా పనిచేశాడు. అయితే గత 36 ఏళ్లుగా పేపర్ బాయ్‌గా కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలయ్యాయి. కొన్నాళ్ల కిందట భార్య చనిపోవడంతో ప్రస్తుతం కుమారుల వద్దే ఉంటున్నాడు. అయితే వారిపై ఆఽధారపడడం ఇష్టం లేక.. 80 ఏళ్ల వయసులోనూ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి.. దినపత్రికలు వేసే పనిలో నిమగ్నమవుతాడు. సమయ పాలన పాటిస్తూ.. సైకిల్‌తోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ పలువుర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉదయం వేళ దినపత్రికలు వేసిన తర్వాత చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి అవసరమైన పనులను చూసుకుంటాడు. సాయంత్రం ఆరు గంటల నుంచి దేవాలయాల సందర్శన చేస్తూ వృద్ధాప్యం అనే ఆలోచన లేకుండా సైకిల్‌తో పరుగులు తీస్తూ ఎంతో మందికి దుర్గారావు ఆదర్శంగా నిలుస్తున్నాడు.