మాదక ద్రవ్యాల నివారణకు కృషి
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:16 PM
జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- డ్రగ్స్, గంజాయి వినియోగంపై సమాచారం ఇవ్వాలి
- ప్రోత్సాహక బహుమతులు అందిస్తాం
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, జనవరి 29 ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నివారణకు విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పోలీసు, ఫారెస్టు, ఎక్సైజ్ శాఖలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలన్నారు. బస్సులు, రైల్వేస్టేషన్లలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రతి మూడు నెలలకు ప్రగతి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి వినియోగంతో కలిగే అనర్థాలపై జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు బాగున్నాయని కలెక్టర్ అభినందించారు. శాఖల వారీగా అవగాహన కార్యక్రమాలను రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి వీటిపై అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న వారి వివరాలను సేకరించాలని డి-అడిక్షన్ సెంటర్ అధికారిని ఆదేశించారు. ప్రతి గ్రామంలో నెలకు ఒకసారి మహిళా పోలీసులతో ర్యాలీ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న, కొంటున్న లేదా ఉపయోగిస్తున్న 1972కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. వారికి నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను రూపుమాపడమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో యాక్షన్‌ప్లాన్ తయారు చేసి అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, పార్వతీపురం మునిసిపల్ కమిషనర్ పావని, మహిళా శిశు సంక్షేమశాఖాధికారి టి.దుర్గాప్రసాద్, ప్రజా రవాణా అధికారి ఎస్.లక్ష్మణరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎ.విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.