Share News

నేరాల నియంత్రణకు కృషి

ABN , Publish Date - Mar 22 , 2026 | 10:57 PM

జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు.

 నేరాల నియంత్రణకు కృషి
ఎస్‌.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ

- చెక్‌పోస్టులను బలోపేతం చేస్తున్నాం

- ఎస్పీ దామోదర్‌

కొత్తవలస/ఎస్‌.కోటరూరల్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. ఆదివారం ఆయన కొత్తవలస, ఎస్‌.కోట పోలీసుస్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నూటికి నూరుశాతం నేరాలను నియంత్రించలేమని.. సమాజంలో నేరాలు జరుగుతూ ఉంటాయని, వాటి నియంత్రణకు పోలీసు శాఖ ప్రయత్నం చేస్తుంటుందని తెలిపారు. కొత్తవలస విశాఖపట్టణానికి దగ్గరలో ఉండడమే కాకుండా రైల్వేస్టేషన్‌ కూడా విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉండడం వల్ల నేరాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ఇక్కడ ట్రాఫిక్‌ నియంత్రణ కోసం కొత్తవలస సీఐ ఎక్కడికక్కడ స్టాపర్లను ఏర్పాటు చేశారన్నారు. మండలంలోని కంటకాపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని బొగ్గు యార్డు నుంచి భారీ వాహనాలలో బొగ్గు రవాణా జరుగుతోందని, ఈ రవాణాను ఆపలేమని, బొగ్గు రోడ్డు మీద పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శనివారం రాత్రే సైబర్‌ నేరాలకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. జిల్లాలో గంజాయి రవాణా నియంత్రణే లక్ష్యంగా వేర్వేరు ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గంజాయి కేసుల్లో అరెస్టయిన నిందితులపై హిస్టరీ షీట్లు తెరవడంతోపాటు గంజాయి వ్యాపారంలో సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తున్నామని చెప్పారు. దీంతోపాటు ఎస్‌.కోట స్టేషన్‌లో సీజ్‌ చేసి ఉంచిన వాహనాలను పరిశీలించి, చట్టప్రకారం వాటిని డిస్పోజ్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, సీఐలు షణ్ముఖరావు, నారాయణమూర్తి, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 10:57 PM