Share News

Efforts for the development of temples ఆలయాల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:58 PM

Efforts for the development of temples

Efforts for the development of temples ఆలయాల అభివృద్ధికి కృషి
వర్చువల్‌గా గిరి వలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

ఆలయాల అభివృద్ధికి కృషి

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

రామతీర్థం గిరి వలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

నెల్లిమర్ల, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖామంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ అన్నారు. రామతీర్థం నీలాచల(బోడికొండ) కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కోసం రూ.3.40 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో 3.7 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించిన గిరివలయం(బీటీ రహదారి)ను బుధవారం ఆయన అమరావతి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పంచాయతీరాజ్‌, సాస్కి నిధులు సుమారు రూ.40 కోట్లతో 22 ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులను మంజూరు చేశామన్నారు. రామతీర్థం గిరిప్రదక్షిణకు వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించడానికి రూ.3.40 కోట్లతో ఈ రహదారిని మంజూరు చేశామని తెలిపారు. ఈ రూపంలో రామునికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అన్నారు. మన సంస్కృతిని పరిరక్షించేందుకు, సంప్రదాయాలను కాపాడేందుకు, ఆలయాల పవిత్రతను రక్షించేందుకు ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నామని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ఆలయాల వద్ద సౌకర్యాలు కల్పిస్తున్నాం

కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఇదొక గొప్ప కార్యక్రమమని, ఇటీవల కాలంలో గుడికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దేవదాయశాఖామంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధితోపాటు ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌గా రూపొందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సహకారంతో ఇప్పటికే శ్రీకాళహస్తి ఆలయం వద్ద గిరిప్రదక్షిణ కోసం రహదారి నిర్మించామని, ఇప్పుడు రామతీర్థం వద్ద ప్రారంభించామని, కోటప్పకొండ వద్ద రహదారి నిర్మాణం త్వరలో పూర్తికానుదని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రతిపాదనలు వచ్చాయని, దీనిపై త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ధూపదీపనైవేద్యం పథకం, కామన్‌ గుడ్‌ఫండ్‌, శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల అభివృద్ధికి, నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ సాధికారత సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రతీ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల్లో భజన మండళ్ల నిర్మాణానికి దేవదాయశాఖ ద్వారా నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కోసం ప్రజాప్రతి నిధులమంతా సమన్వయంతో కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ రహదారిని నిర్మించామని తెలిపారు. రామతీర్థం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని చెప్పారు.

రామతీర్థం గొప్ప అధ్యాత్మిక కేంద్రం

కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ రామతీర్థం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందని చెప్పారు. ఇక్కడ కేవలం హిందూ దేవాలయమే కాకుండా బౌధ్ధ, జైన సంస్కృతుల ఆనవాళ్లు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.3.40 కోట్లను వెచ్చించి 3.7 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించినట్లు చెప్పారు. ఈ రహదారి అభివృద్ధి వల్ల గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరుగుతుందన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. రామతీర్థం అభివృద్ధికి మొదటి దశలో రూ.3.40 కోట్లతో రోడ్డు నిర్మించామని, కోనాడ వేణుగోపాలస్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.కోటీ 25 లక్షలతో ప్రతిపాదనలు పంపామన్నారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో జరిగిన దుర్ఘటనలను గుర్తుచేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ, జడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ, డ్వామా పీడి శారదాదేవి, ఆర్‌డీవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 11:59 PM