Share News

Education ఆటపాటలతో విద్య

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:02 AM

Education Through Games and Activities విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో క్రీడలను తప్పనిసరి చేసింది. రోజూ గంటపాటు క్రీడలు నిర్వహించాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Education  ఆటపాటలతో విద్య

  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

  • మన్యంలో ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టిన కలెక్టర్‌

  • ఇక రాష్ట్రవ్యాప్తంగా అమలు

పార్వతీపురం, జనవరి4(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో క్రీడలను తప్పనిసరి చేసింది. రోజూ గంటపాటు క్రీడలు నిర్వహించాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మన్యం జిల్లాలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి గత ఏడాది సెప్టెంబరులో ప్రయోగా త్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బడుల్లో గంటపాటు విద్యార్థులతో వ్యాయామం, ఏరోబిక్‌ నృత్యం, యోగా వంటివి చేయిస్తున్నారు. క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసం, ఫిట్‌నెస్‌ మెరుగుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహపడుతుంది. అయితే ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఆయన ఆదేశాల మేరకు దీనిపై పూర్తి కసరత్తు చేసిన రాష్ట్ర విద్యాశాఖ అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి చేస్తూ.. షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు డిసెంబరు 29న రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలో అమలవుతున్న ముస్తాబు, రెవెన్యూ క్లినిక్‌లు అన్ని జిల్లాల్లో ప్రారంభించారు. తాజాగా బడుల్లో క్రీడలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ కావడంతో మన్యం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆనందంగా ఉంది

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది సెప్టెంబరులో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పిల్లలకు క్రీడలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో దీనిపై సీఎం చంద్రబాబుకు వివరించా. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం ఎంతో ఆనందంగా ఉంది.

- ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌, పార్వతీపురం మన్యం

Updated Date - Jan 05 , 2026 | 12:02 AM