చదువే వారి బలం.. అభివృద్ధే సంకల్పం
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:05 PM
ఆ గిరిజన గ్రామం పేరు చెబితే ఠక్కున గుర్తుకువచ్చేది అభివృద్ధి. గ్రామస్థులంతా విద్యాధికులే. ఎందరో ఉన్నత కొలువుల్లో ఉన్నారు.
- 90 శాతం మంది విద్యాధికులు
- ఉన్నత కొలువుల్లో అడవి బిడ్డలు
- సేంద్రీయ, ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం
- ఆపద వస్తే చందాలు వేసుకుని సాయం
- ఆదర్శంగా దురుబిలి గ్రామస్థులు
ఆ గిరిజన గ్రామం పేరు చెబితే ఠక్కున గుర్తుకువచ్చేది అభివృద్ధి. గ్రామస్థులంతా విద్యాధికులే. ఎందరో ఉన్నత కొలువుల్లో ఉన్నారు. మరికొందరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. యువకులంతా లైబ్రరీలోనే అధిక సమయం గడుపుతుంటారు. ఇక్కడ రైతులంతా సేంద్రీయ, ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటారు. గ్రామంలో ఎవరికైనా ఆపద వస్తే అంతా ఏకమవుతారు. చందాలు వేసుకుని సాయం చేస్తుంటారు. మద్యం పానం అనే మాటే ఇక్కడ వినిపించదు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలను అసలు మరువరు. ‘చదువే మా బలం.. అభివృద్ధే మా సంకల్పం’ అన్నట్లు అన్నిట్లో దూసుకుపోతూ ఆదర్శంగా నిలుస్తున్నారు దురుబిలి గ్రామస్థులు. ఈ గ్రామంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కురుపాంరూరల్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం కురుపానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దురుబిలి గ్రామం. మొత్తం 72 కుటుంబాలకు చెందిన 287 మంది నివసిస్తున్నారు. వీరిలో 90శాతం మంది చదువుకున్న వారే. 104 మంది ఓటర్లగా నమోదయ్యారు. ఏ ఒక్క కుటుంబానికీ సెంటు భూమి లేదు. కేవలం కొండపోడునే నమ్ముకుని జీవితాలను నెట్టుకొస్తున్నారు. విద్యాభివృద్ధి ద్వారానే పేదరికాన్ని పారదోలవచ్చని నమ్మారు. గత మూడు దశాబ్దాలుగా చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. శ్రమదానం చేసి గ్రామంలోని పాఠశాల భవనాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఆరో తరగతి నుంచి పట్టణాలకు వెళ్తున్నారు. ఇంగ్లీషు మీడియంలో చదువుకునేందుకు ఎక్కువమంది మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన బి.మచ్చయ్య ఇంటిలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా పని చేస్తున్నారు. బిడ్డిక సుక్కు, బిడ్డిక లక్ష్మయ్య, బిడ్డిక పార్వతి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, బిడ్డిక ఈరమ్మి, ఆరిక మహాలక్ష్మి మహిళా పోలీసులుగా, ఆరిక పూర్ణమ్మ ఏఎన్‌ఎంగా, ఆరిక గవరయ్య, పువ్వల మౌళి, ఆరిక నీలయ్య ఉపాధి హామీ పథకం ఉద్యోగులుగా, బిడ్డిక భానుచందర్ సీఆర్‌టీగా విధులు నిర్వహిస్తున్నారు. బి.సరోజిని, బి.భానుచందర్ బీఈడీ, బి.వీరమ్మ, పువ్వల సౌందర్యతో మరో 14 మంది డీఎడ్(టీటీసీ) పూర్తి చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వీరే కాకుండా ఫిషరీస్ డిప్లొమ చదువుకున్నవారు ఐదుగురు, డెయిరీ డిప్లొమ చదువుకున్నవారు ఐదుగురు, వెటర్నరీ డిప్లొమ చేసిన వారు ముగ్గురు, అగ్రికల్చరల్ డిప్లొమ పూర్తి చేసినవారు ఇద్దరు, ల్యాబ్ టెక్నీషియన్ శిక్షణ పొందినవారు ఒకరు ఉన్నారు. వీరంతా పోటీపరీక్షలకు సిద్ధం అవుతున్నారు. అలాగే, 12 మంది బీఏ, బీకాం, బీఎస్సీ, ఏడుగురు గ్రాడ్యుయేషన్, ఒకరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీరంతా ప్రాథమిక విద్యాభ్యాసం దురుబిలిలో చేసిన వారే.
చిరుధాన్యాల సాగుతో ఆదాయం..
గ్రామస్థులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో పండించే కూరగాయలను మండలం కేంద్రం కురుపాం తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మరికొందరు మహిళలు తమ కొండపోడుల్లో జొన్నలు, కొర్రలు, రాగులు(చోడి) వంటి చిరు ధాన్యాలను సాగు చేస్తుంటారు. వాటికి పొట్టు తీసి మార్కెట్‌కు తరలించి ఆదాయం పొందుతున్నారు. గ్రామానికి చెందిన ఆరిక నర్సమ్మ అనే మహిళను ప్రభుత్వం గత ఏడాది యూరప్‌కు పంపించింది. ఏడు దేశాల్లో జరిగే ప్రకృతి వ్యవసాయాన్ని అధ్యయనం చేసి నర్సమ్మ తిరిగి వచ్చారు. గ్రామస్థులు తరచూ సమావేశమై సమస్యలపై చర్చించుకుంటారు. ఎవరికైనా ఆపద వస్తే చందాలు వేసుకుని సాయం చేస్తుంటారు.
ఉన్నతాధికారులు రాక..
గిరిజనుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై గ్రామ యువకులతో కూడిన బృందం అధ్యయం చేస్తూ గ్రామస్థులతో దరఖాస్తు చేయించి లబ్ధిపొందేటట్టు చేస్తుంది. ప్రభుత్వం కొత్తగా ఏ పథకం అమలు చేసినా తొలుత దురుబిలిలో ప్రవేశపెడుతుంది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కురుపాం మండలానికి విజిట్‌కు వచ్చినప్పుడు తప్పనిసరిగా దురుబిలి గ్రామాన్ని సందర్శిస్తుంటారు. కురుపాంకు చెందిన స్వచ్ఛంద సేవకుడు షేక్ గౌష్ దాతలతో సంప్రదించి దురుబిలిలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన డీవీజీ శంకరరావు సందర్శించారు. ఎందరో ఐఎఎస్ అధికారులు కూడా ఈ గ్రామానికి వచ్చారు. యువకులంతా లైబ్రరీలోనే అధిక సమయం గడుపుతూ తమ కెరీర్‌ను చక్కదిద్దుకుంటున్నారు. గ్రామ పంచాయతీ తరపున న్యూస్ పేపర్లను తెప్పిస్తున్నారు. గ్రామంలో వృద్ధులను మినహాయిస్తే అందరూ చదువుకున్న వారే. గ్రామంలో తాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్తగా పెళ్లయిన 12 మందికి అధికారులు నూతన గృహాలను మంజూరు చేశారు. తమకు కూడా ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు మంజూరు చేయాలంటూ గ్రామస్థులు కోరుతున్నారు. ఏనుగులు గతంలో పంటలను నాశనం చేశాయని, వాటి బారి నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సంఘటితంగా ఉంటాం..
మా గిరిజన, సవర తెగల్లో చాలా సంఘటితంగా ఉంటాం. నేరేడువలస, సంపన్నగూడ, మామిడిమానుగూడ, దండుసూరగూడ తదితర గ్రామాల ప్రజల ఐకమత్యం చూసి మేము ఎంతో నేర్చుకున్నాం. ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. గ్రామంలో మద్యపానం అన్న పదమే వినపడదు.
-పువ్వల పత్తి, మాజీ సర్పంచ్, దురుబిలి
అన్ని ఆచారాలూ కొనసాగిస్తున్నాం: గ్రామంలోని పిల్లలు కూడా ఆచారాలు కొనసాగించేటట్టు ప్రయత్నిస్తున్నాం. కందికొత్తలు, పిల్లిపండగా, టెంక కొత్తలు, వారాలు ఇలా అన్ని ఆచారాలూ ఉన్నాయి.
-తోయిక మంగమ్మ, దురుబిలి గ్రామం..