Eating out is a burden. బయట తినాలంటే భారమే
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:45 PM
Eating out is a burden. ఉదయం ఒక ప్లేట్ ఇడ్లీ.. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ..బజ్జీ రోజువారీ జీవితంలో సాధారణంగా కన్పించే ఈ ఖర్చులే ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలకు తోడు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు చుక్కలు చూపిస్తుండడంతో హోటల్ భోజనం క్రమంగా విలాసవంతంగా మారుతోంది.
బయట తినాలంటే భారమే
వంట గ్యాస్ షాక్‌తో హోటళ్లలో ధరల మోత
టిఫిన్ నుంచి భోజనం దాకా పెరిగిన రేట్లు
కొన్ని టిఫిన్ సెంటర్లలో ధరలు పెంచలేక క్వాంటీటీలో కోత
ఉదయం ఒక ప్లేట్ ఇడ్లీ.. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ..బజ్జీ రోజువారీ జీవితంలో సాధారణంగా కన్పించే ఈ ఖర్చులే ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలకు తోడు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు చుక్కలు చూపిస్తుండడంతో హోటల్ భోజనం క్రమంగా విలాసవంతంగా మారుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల నిర్వహణ వ్యయాలు తట్టుకోలేక యజమానులు ధరలు పెంచడం.. లేని పక్షంలో వడ్డించే పరిమాణాన్ని తగ్గించడం వంటి చర్యలకు దిగుతున్నారు. దీంతో బయట భోజనంపై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు.
విజయనగరం రింగురోడ్డు, జూన్ 16(ఆంధ్రజ్యోతి):
టిఫిన్, భోజనం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. టీ మొదలు భోజనం వరకు ఇదే పరిస్థితి. ఏం తిందామన్నా ఓ క్షణం ఆలోచించాల్సి వస్తోందని సామాన్యులు అంటున్నారు. నిర్వహణ వ్యయాలు తట్టుకోలేక పెంచక తప్పడం లేదని యజమానులు చెబుతున్నారు. వారి మాటల్లో ప్రధానంగా వినిపించేది గ్యాస్ ధర. కొద్ది నెలల వ్యవధిలోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు రూ.3,200కు చేరుకోవడం హోటల్ యాజమానులను కలవర పెడుతోంది. చిన్న హోటల్‌కు నెలకు 10 నుంచి 15 సిలిండర్లు అవసరం అవుతుండగా, పెద్ద రెస్టారెంట్లలో 40 నుంచి 60 సిలిండర్లు వినియోగిస్తున్నారు. దీంతో నెలవారీ ఖర్చుల్లో వేల రూపాయల అదనపు భారం పడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్‌తో పాటు వంటనూనెలు, బియ్యం, పప్పులు, మసాలా దినుసులు, కూరగాయల ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగింది. దీంతో హోటల్ యాజమానులు ఆహార బిల్లును పెంచేస్తున్నారు. సామాన్యుల జేబులకు చిల్లు పడుతోంది.
- ఉదయం తినే ఇడ్లీ, బొండా, పూరీ తదితర వాటికి అదనంగా 5 నుంచి 15 రూపాయలు, మధ్యాహ్న భోజనానికి 30 నుంచి 40 రూపాయలు, అలాగే బిర్యాని ఇతర స్పెషల్ ఐటమ్స్‌కు 50 నుంచి 90 రూపాయలు పెంచేశారు. దీంతో నెలకు హోటల్‌పై ఆధారపడే ఉద్యోగి, విద్యార్థికి సుమారు రూ.500 నుంచి రూ.1,500 వరకు అదనపు భారం పడుతోంది.
పరిమాణం తగ్గింపు
జిల్లా వ్యాప్తంగా పెద్ద రెస్టారెంట్లు 80 వరకూ వుండగా, చిన్న హోటళ్లు, పార్లర్‌లు, టిఫిన్ సెంటర్లు, డాబాలు కలిపి 300 వరకూ వున్నాయి. కొంత మంది చిన్న హోటళ్లు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు కస్టమర్లు తగ్గిపోతారన్న భయంతో ధరలు పెంచకుండా వడ్డించే పరిమాణం తగ్గిస్తున్నారు. దోసెల పరిమాణం చిన్నది చేయడం, వడలు సైజు తగ్గించడం, చెట్నీ, సాంబారు పరిమితంగా ఇవ్వడం వంటి మార్పులు కన్పిస్తున్నాయి.
విద్యార్థులు, ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం
ఇళ్లకు దూరంగా వుండే విద్యార్థులు, బ్యాచిలర్లు, ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా హోటళ్లపైనే ఆధారపడుతుంటారు. రోజువారీ భోజన ఖర్చు ఒక్కసారిగా పెరగడంతో నెలాఖరులో బడ్జెట్ దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెరగకపోయినా, భోజన ఖర్చు మాత్రం ప్రతి నెల పెరుగుతోందని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయాల కోసం కొన్ని పెద్ద హోటళ్లు గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఇండక్షన్, ఎలక్ట్రీక్, కమర్షియల్ స్టౌవ్‌లు, స్టీమ్ ఆధారిత వంట విధానాల వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు వారికి పెను సవాళ్లుగా మారుతున్నాయి.
నిర్వహణ కష్టం అవుతోంది
జి.శ్రీనివాసరావు, హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
కొంత కాలంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు, వంటనూనెలు, కూరగాయలు, మసాలా దినుసుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. హోటల్ నిర్వహణ ఖర్చు భరించడం కష్టంగా మారింది. ధరలు పెంచడం మా ఉద్దేశం కాదు. అయితే పెరిగిన వ్యయాల కారణంగా మెనూ ధరలను స్వల్పంగా సవరించాల్సి వచ్చింది. ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్‌పై పన్నులు తగ్గించి, హోటల్ రంగానికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తే వినియోగదారులపై భారం పడకుండా చూడగలం.
భోజనం భారం అవుతోంది
ఎస్.రమేష్, ప్రైవేటు ఉద్యోగి, విజయనగరం
ఉద్యోగ రీత్యా ప్రతిరోజు హోటల్‌పైనే ఆఽధారపడుతున్నాను. గతంలో భోజనానికి అయ్యే ఖర్చుతో పోల్చితే గణనీయంగా పెరిగింది. ధరలు నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు సాంబారు ఇడ్లీ రూ.60 నుంచి రూ.70 ఉండగా నేడు రూ.100కు చేరింది. బిర్యానీ తినడం మరింత కష్టమే. ప్రభుత్వమే ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
==============