Share News

తింటే ‘రంగు’పడుద్ది

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:16 PM

రంగురంగులతో, వివిధ ఆకారాలతో ఉండే పాపడాలను(పాపడ్స్‌) తినేందుకు చిన్నారులు, యువత ఎంతగానో ఆసక్తి కనబరుస్తుంటారు.

 తింటే ‘రంగు’పడుద్ది
రంగురంగుల పాపడాలు

- రంగురంగుల తినుబండారాలతో పొంచి ఉన్న ప్రమాదం

- సింథటిక్‌ కలర్స్‌తో తయారు చేసే పాపడాలు, ఆహార పదార్థాలతో రోగాలు

- జిల్లాలో ఇష్టారాజ్యంగా అమ్మకాలు

- నియంత్రించకపోతే ముప్పు తప్పదు

- ఇప్పటికే బ్యాన్‌ చేసిన తమిళనాడు ప్రభుత్వం

పాలకొండ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రంగురంగులతో, వివిధ ఆకారాలతో ఉండే పాపడాలను(పాపడ్స్‌) తినేందుకు చిన్నారులు, యువత ఎంతగానో ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే, కలర్‌ఫుల్‌గా కనిపించే ఆ పాపడాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినేందుకు రుచికరంగా ఉన్నప్పటికీ వాటి తయారీకి వినియోగించే కృత్రిమ రంగులతో అనారోగ్య సమస్యలు తప్పవని ఫుడ్‌సేప్టీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మన్యం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పాపడాలు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వీటి అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. ఒడిశా నుంచి ఇబ్బడిముబ్బడిగా ఈ పాపడాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. ఎంతో ఆకర్షణీయమైన రంగులతో మార్కెట్‌ను ముంచెత్తుతున్న పాపడాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం వీటిని ఇటీవల బ్యాన్‌ చేసింది. మన రాష్ట్రంలో కూడా వీటిని బ్యాన్‌ చేయాలనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.

ఇతర ఆహార పదార్థాల్లోనూ వినియోగం...

రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ ఆహార రంగులను పెళ్లిళ్లు, ఫంక్షన్ల విందు భోజనాలతో పాటు హోటళ్లలో, స్ట్రీట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా రెడ్‌ 40, రెడ్‌ త్రీ, ఎల్లోఫైవ్‌, ఎల్లో సిక్స్‌ అనే సింథటిక్‌ రంగులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. దీంతో ఆహారం కంటికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు అద్భుతమైన రుచి లభిస్తుంది. అదే సమయంలో ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తున్నాయి. ప్రధానంగా సింథటిక్‌ కలర్స్‌తో తయారు చేసిన పాపడాలు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘ముఖ్యంగా పిల్లల్లో అటెన్షన్‌, డీపీసీటీ, హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) వచ్చే ప్రమాదం ఉంది. చర్మం, జుత్తుకు చాలా హాని చేస్తుంది. కాలేయం, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి.’ అని పేర్కొంటున్నారు.

చర్యలు తీసుకుంటాం

జిల్లాలో పాపడాలు తయారు చేసే కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేస్తాం. నిషేధిత సింథటిక్‌ కలర్స్‌తో వాటిని తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు. రంగులు వేయకుండా సహజ పద్ధతిలో తినుబండారాలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటాం. స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లలో నిషేధిత సింథటిక్‌ కలర్స్‌ను వినియోగించరాదు. ప్రజలు కూడా వీటిపై అవగాహన పొంది దూరంగా ఉండాలి.

- ఎం.వినోద్‌కుమార్‌, జిల్లా ఫుడ్‌సేఫ్టీ అఽధికారి

వాటి జోలికి వెళ్లొద్దు

సింథటిక్‌ రంగులతో తయారు చేసిన ఆహారం జోలికి వెళ్లరాదు. రసాయనాలతో తయారు చేసే ఈ పదార్థాలు తినడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సహజసిద్ధంగా తయారయ్యే ఆహారాన్ని తినడం శ్రేయస్కరం.

-డాక్టర్‌ జె.రవీంద్రకుమార్‌, చిన్నపిల్లల వైద్యనిపుణులు, జిల్లా ఆసుపత్రి, పార్వతీపురం మన్యం

Updated Date - Aug 06 , 2026 | 11:16 PM