Share News

Easy Shoppingఈజీ షాపింగ్‌

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:07 AM

Easy Shopping ఇంట్లో అవసరానికి ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారా.. అయితే పాత రోజుల్లా ఇల్లు దాటక్కర్లేదు.. ఒకే రకమైన వస్తువులే ఉంటాయన్న భీతి లేదు. వెంటనే డబ్బులు ఇచ్చేయాలన్న ఒత్తిడి లేదు. అదే నండి ఆన్‌లైన్‌ మార్కెట్‌. నేడు పట్టణాల నుంచి పల్లెల వరకూ అతి వేగంగా విస్తరిస్తున్న వ్యాపారమిది.

Easy Shoppingఈజీ షాపింగ్‌
ఆర్డర్‌లను డోర్‌ డెలవరీకి తీసుకువెళుతున్న బాయ్స్‌

ఈజీ షాపింగ్‌

ఇంటి వద్దకే అన్నీ..

జిల్లాలో రోజుకు 20వేలకు పైగా ఆన్‌లైన్‌ ఆర్డర్లు

పల్లెలకూ విస్తరణ

డెలవరీ బాయ్స్‌కు పెరిగిన ఆదరణ

జిల్లాలో 6వేల మందికి పైబడి ఉపాధి

ఇంట్లో అవసరానికి ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారా.. అయితే పాత రోజుల్లా ఇల్లు దాటక్కర్లేదు.. ఒకే రకమైన వస్తువులే ఉంటాయన్న భీతి లేదు. వెంటనే డబ్బులు ఇచ్చేయాలన్న ఒత్తిడి లేదు. అదే నండి ఆన్‌లైన్‌ మార్కెట్‌. నేడు పట్టణాల నుంచి పల్లెల వరకూ అతి వేగంగా విస్తరిస్తున్న వ్యాపారమిది. అత్యధికంగా వినియోగదారులను ఆకట్టుకుంటున్న మార్కెట్‌గా పేరొందుతోంది. వివిధ పేరొందిన ఆన్‌లైన్‌ డెలవరీ సంస్థలకు పెరుగుతున్న ఆదరణతో జిల్లాలో 6వేల మందికి పైబడి ఉపాధి పొందుతున్నారు.

గజపతినగరం, జూలై 12(ఆంధ్రజ్యోతి):

ఆన్‌లైన్‌ మార్కెట్‌కు జిల్లాలోనూ ఆదరణ పెరుగుతోంది. ఏ వస్తువైనా మార్కెట్‌ ధర కంటె తక్కువకు ఇంటికే చేరుతుండడంతో చాలామంది ఆన్‌లైన్‌ మార్కెట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. పండగలు, వివిధ ప్రత్యేక రోజుల్లో ప్రకటించే ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. అన్ని సరుకుల ధరలను ఆన్‌లైన్‌తో పోల్చుకుంటు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో లభించే వస్తువు ధరకంటే ఆన్‌లైన్‌లో 20శాతం వరకు తక్కువకు లభిస్తుండడం, దీనికి తోడు క్రిడెట్‌ కార్డుల ద్వారా క్యాష్‌ బ్యాక్‌లు వస్తుండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అందుకే బ్యాగ్‌ నిండా పార్సిల్స్‌తో ఇప్పుడు ఎక్కడ చూసినా డెలవరీ బాయ్‌లే కనిపిస్తున్నారు. పగలనకా, రేయినకా, ఎండనకా, వాననకా కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు బైక్‌లు, స్కూటర్లపై అందుబాటులో ఉంటున్నారు. వస్తువులు, ఆహారం కూడా చెంతకు చేరుస్తూ సేవలు అందజేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ బిజినెస్‌ పెరిగింది.

- ఫ్యాన్సీ, ఎలక్ర్టి్ట్రకల్‌, క్లాత్‌, రడీమేడ్‌, టూల్స్‌, హోమ్‌ నీడ్స్‌, మెడికల్‌ కిరాణా, ఫర్నీచర్‌ తదితర అన్ని రకాల వస్తువుల నుంచి ఫుడ్‌ ఐటమ్స్‌ వరకు అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వస్తువులను డోర్‌ డెలవరీ అందించే సంస్థలు పెరుగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బ్రాంచులు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌ సేవలు అందజేస్తున్నాయి. జిల్లాలో ఆయా సంస్థలకు చెందిన బ్రాంచ్‌లు సుమారు 60వరకు ఉన్నాయి.

- పండగల సమయంలో ఆన్‌లైన్‌ బిజినెస్‌ ఘణనీయంగా పెరుగుతోంది.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆన్‌లైన్‌లోనే దుస్తులు ఆర్డర్‌ పెడుతున్నారు. ఇంటికి అవసరమైన ఇతర వస్తువులనూ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. ఆహార పదార్థాలను ప్రతి పూటా గతంలో ఇంటిలో తయారు చేసుకొనేవారు. ప్రస్తుతం వీకెండ్‌, ఇతర ముఖ్య రోజుల్లో ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తున్నారు.

డెలవరీ బాయ్స్‌కు డిమాండ్‌

ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెరగడంతో డెలవరీ బాయ్స్‌కు డిమాండ్‌ పెరిగింది. పార్సిల్స్‌పై గతంలో అంతంతమాత్రంగానే ఉండే కమీషన్‌ ఇటీవల ఏజెన్సీలు పెంచాయి. ప్రస్తుతం లోకల్‌, లాంగ్‌ రూట్‌ బట్టి పార్సిల్‌పై రూ.14నుంచి రూ.20 వరకు కమీషన్‌ ఇస్తున్నాయి. వారం,వారం పేపెంట్లు వస్తున్నాయి. ఈ లెక్కన నెలకు రూ.20 నుంచి రూ.30వేల వరకు సంపాదించుకుంటున్నారు. రోజుకు 40నుంచి 60 వరకు పార్సిల్స్‌ డెలవరీ చేస్తున్నారు.

ఉరుకులు పరుగుల జీవితం

మూడేళ్లుగా డెలవరీ బాయ్‌గా పనిచేస్తున్నాను. ఆర్డర్‌లో సూచించిన సమయానికి పార్సిల్‌ డెలవరీ చేయాలి. అందుకు ఎండైనా, వానైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉరుకులు,పరుగులు పెడుతూ పార్సిల్‌ అందజేస్తాం.

- సత్యన్నారాయణ, సీతారామపురం, గజపతినగం మండలం

ఇబ్బందులు ఉంటాయి

డెలవరీ చేసే సమయంలో ఆర్డర్‌లు పెట్టినవారు ఫోన్‌ నెంబర్‌, అడ్రస్‌ సరిగా ఇవ్వక పోవడం వల్ల ఒక్కోసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్డర్‌ డెలవరీ చేస్తేనే మాకు కమీషన్‌ వస్తుంది.లేక పోతే ఎంత తిరిగినా ఫలితం ఉండదు. అటువంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి.

- జి.సాయికుమార్‌, గజపతినగరం

Updated Date - Jul 13 , 2026 | 12:07 AM