మధ్యవర్తిత్వంతో సులువుగా కేసుల పరిష్కారం
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:22 AM
మధ్యవర్తిత్వంతో సులువుగా కేసులు పరిష్కరించుకోవచ్చునని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు.
- జిల్లా ప్రధాన న్యాయాధికారి బబిత
విజయనగరం దాసన్నపేట, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వంతో సులువుగా కేసులు పరిష్కరించుకోవచ్చునని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయాధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ ప్రక్రియ చాలా సులువైనదని, ఖర్చులేనిదని వారికి చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా 90 రోజుల పాటు ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. మనోవర్తి కేసులు, ప్రమాద బీమా, గృహ హింస, చెక్కు బౌన్సు కేసులను సులువుగా పరిష్కరించుకోవచ్చునన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో మధ్యవర్తిత్వం.. దేశం కోసం అనే స్టాల్‌ని ఏర్పాటు చేసి కక్షిదారులకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద కూడా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.