భూ‘మాయ’
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:04 AM
మండలంలోని చిన్నిపాలెం గ్రామ రెవెన్యూలో ప్రభుత్వ భూములు, గెడ్డలు, వాగులు మాయమవుతున్నాయి.
- చిన్నిపాలెంలో ప్రభుత్వ భూముల కబ్జా
- గెడ్డలు, వాగులు కూడా..
- ఆక్రమణదారులకు కొందరు రెవెన్యూ సిబ్బంది సహకారం
- సర్వేలో అవకతవకలు
కొత్తవలస, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చిన్నిపాలెం గ్రామ రెవెన్యూలో ప్రభుత్వ భూములు, గెడ్డలు, వాగులు మాయమవుతున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ భూములను కబ్జా చేస్తున్నాయి. ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రామంలోని రైతులు గత వందేళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములకు సంబంధించి తమ వద్ద రికార్డులు ఉన్నాయని, తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాస్ పుస్తకాలను మంజూరు చేయాలని రైతులు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ ప్రాంతానికి ఒక పెద్ద సిమెంట్ కర్మాగారంతో పాటు బడా రియల్ ఎస్టేట్ సంస్థలు వచ్చాయి. ఇక్కడి ప్రభుత్వ భూములు, గెడ్డలు, వాగులపై వాటి కన్ను పడింది. వాటిని మట్టితో కప్పేసి కబ్జా చేస్తోన్నాయి. అధికారులు కూడా రెవెన్యూ రికార్డుల్లో బడా సంస్థల పేర్లను నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఒకపక్క తమకు భూ హక్కులు కల్పించాలని.. మరోపక్క ప్రభుత్వ భూములు కాపాడాలని గ్రామానికి చెందిన రైతులు పోరాటాలు సాగిస్తున్నారు. చిన్నిపాలెం రెవెన్యూలో ఉన్న 472.76 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామానికి చెందిన చిన్నిపాలెం రైతు సంక్షేమ సమితి ప్రతినిధులు మొయ్యి దేముడుబాబు, తమడపు అప్పారావు, బాదిరెడ్డి రమణ, బి.సత్యం, ఎర్రయ్య తదితరులు పలుమార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల రెవెన్యూ అధికారులు ఆ గ్రామానికి వెళ్లి సర్వే చేశారు. చుట్టు పక్కల ఉన్న కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను పిలిపించారు. ఈ సర్వేలో ప్రభుత్వ భూమి 86 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరోసారి సర్వే చేపట్టారు. ఈసారి 145 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. దీంతో రెవెన్యూ సిబ్బంది తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు, సిమెంట్ కర్మాగార ప్రతినిధులతో కుమ్మక్కై ప్రభుత్వ భూమిని మాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇన్‌చార్జి తహసీల్దార్ సునీతను వివరణ కోరగా.. ‘చిన్నిపాలెం గ్రామ రెవెన్యూలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ సిబ్బందితో సర్వే చేస్తున్నాం. రికార్డుల్లో ఎంత ప్రభుత్వ భూమి ఉంది? ప్రస్తుతం ఎంత విస్తీర్ణం ఉందనే విషయమై సర్వే జరుగుతోంది.’అని తెలిపారు.
తహసీల్దార్ సస్పెన్షన్..
కొత్తవలస తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన పి.అప్పలరాజు కొద్ది నెలల కిందట 11 ఎకరాల విస్తీర్ణం గల ఓ చెరువులో మూడు ఎకరాలను జిరాయితీ భూమిగా మార్పు చేసి ఒక రియల్ ఎస్టేట్ యజమానికి కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి 1బీని కూడా ఇచ్చారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో సదరు తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఈ మండలానికి తహసీల్దార్ లేరు. ఇటీవల కొత్తగా ఓ మహిళను తహసీల్దార్‌గా నియమించినప్పటికి ఇంత వరకు విధుల్లో చేరలేదు.
సర్వే పారదర్శకంగా లేదు
చిన్నిపాలెంలో భూ సర్వే పారదర్శకంగా జరగడం లేదు. ఇక్కడ ప్రభుత్వ భూమి సుమారు 473 ఎకరాలు ఉంటే 145 ఎకరాలే చూపిస్తున్నారు. మిగిలిన భూమి ఏమైందో నిగ్గు తేల్చాలి. ఇక్కడ ఎకరం భూమి విలువ సుమారు కోటి రూపాయలు వరకు ఉంది. ప్రభుత్వ భూమిని పరిరక్షించే వరకు పోరాటం చేస్తాం.
-రైతు సంక్షేమ సమితి ప్రతినిధులు, చిన్నిపాలెం