ఎవరికి వారే
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:54 PM
జిల్లాలో మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి కూటమిలో ఒక రకమైన అస్పష్ట వాతావరణం కనిపిస్తోంది.
- కూటమిలో తేలని సీట్ల సర్దుబాటు
- దృష్టిపెట్టిన మూడు పార్టీల నాయకత్వాలు
- స్ర్కూట్నీ నాటికి స్పష్టత
విజయనగరం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి కూటమిలో ఒక రకమైన అస్పష్ట వాతావరణం కనిపిస్తోంది. పొత్తులో భాగంగా రాజాం మునిసిపాల్టీ జనసేనకు, నెల్లిమర్ల నగర పంచాయతీ బీజేపీకి, విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి మునిసిపాల్టీ టీడీపీకి కేటాయించారు. కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి ఇది షాకింగ్ పరిణామమే. సర్దుబాటులో భాగంగా ఒక వ్యూహం ప్రకారమే జిల్లాలో కేటాయింపులు చేశారు. అయితే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఈ సర్దుబాట్లు చాలా సులువుగా నడిచాయి. ఎందుకంటే అప్పటివరకూ టీడీపీలో ఉన్న వారు సర్దుబాటులో భాగంగా జనసేన, బీజేపీలోకి వెళ్లి ఆశావహులుగా మారారు. కానీ, జిల్లా రాజకీయంగా భిన్నంగా ఉంటోంది. ఎవరికి వారే అన్నట్టు సిద్ధాంతపరంగా ఉంటారే తప్ప.. పదవుల కోసం పార్టీలు మారేందుకు ఇష్టపడరు. అక్కడే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే పొత్తుల విషయంలో రాష్ట్రస్థాయిలో జరిగిన నిర్ణయం కాబట్టి స్థానికంగా ఏ ఒక్కరూ ప్రభావితం చేసే అవకాశం లేదు. తొలి దశలో ఎన్నికలు జరగనున్న విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి మునిసిపాల్టీ, నెల్లిమర్ల నగర పంచాయతీలో నెలకొన్న వివాదాలను మూడు పార్టీల హైకమాండ్లు ఇట్టే పరిష్కారం చూపాయి. ఎందుకంటే హైకమాండ్ల ఆదేశాల అనుసారమే నడుచుకోవాల్సి ఉండడంతో స్థానిక నేతల ఆగ్రహం, ఆవేదన ఆదివారం సాయంత్రానికి నీటిబుడగలా మారిపోయింది.
- విజయనగరం కార్పొరేషన్‌కు సంబంధించి మేయర్ అభ్యర్థిత్వం టీడీపీకి ఖరారైంది. ఇక్కడ జనసేన 20కుపైగా స్థానాలను ఆశించింది. కానీ, టీడీపీ 10 స్థానాల మాత్రమే వారికి ఆఫర్ చేసింది. దీనిని నిరసిస్తూ జనసేన స్థానిక నాయకత్వం ఏకంగా మేయర్ అభ్యర్థితో పాటు 22 డివిజన్లలో జనసేన అభ్యర్థులను రంగంలోకి దించడం సంచలనంగా మారింది. కూటమి ధర్మానికి ఇది విరుద్ధమని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే కూటమి మేయర్ అభ్యర్థిగా అవనాపు భార్గవి పేరు ఖరారైంది. ఆపై నామినేషన్ల విత్‌డ్రాకు సమయం ఉండడంతో జనసేనకు గౌరవప్రదమైన సీట్లను కేటాయించి.. మిగతా స్థానాల్లో విత్ డ్రా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే విజయనగరం కార్పొరేషన్ విషయంలో కూటమిలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
- నెల్లిమర్ల నగర పంచాయతీ విషయంలో ఇదే పితులాటకం నడుస్తోంది. ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా బీజేపీకి కేటాయించారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో టీడీపీకి బలం ఉంది. ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన లోకం కళ్యాణి మాధవి ఉన్నారు. మొత్తం 23 వార్డులు ఉండగా..టీడీపీ నుంచి 23 మంది.. జనసేన నుంచి 23 మంది నామినేషన్ వేశారు. అందుకే ఇక్కడ జఠిలంగా మారింది. తీర చూస్తే బీజేపీ మాత్రం 4 వేశారు. ఇక్కడ కూడా మూడు పార్టీల నాయకులు సమన్వయానికి వస్తున్నారు. నామినేషన్ల విత్‌డ్రాకు సమయం ఉండడంతో ఈలోపు అన్ని కొలిక్కి తేవాలని చూస్తున్నారు. అయితే ఇదంతా టీకప్పులో తుఫాను అని చెబుతున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
- బొబ్బిలిలో సైతం జనసేన తమకు ఎక్కువ స్థానాలు కావాలని చెబుతోంది. 11 అడిగారు 11 స్థానాల్లో పోటీకి దిగారు. టీడీపీ మాత్రం 4 ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. దీనిపై మూడు పార్టీల నాయకత్వాలు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.