Share News

Dussehra Festivities దసరా సందడి

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:47 PM

Dussehra Festivities మన్యంలో దసరా సందడి నెలకొంది. మంగళవారం ఘనంగా పండుగను నిర్వహించేందుకు జిల్లా వాసులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాహన పూజలకు సర్వం సిద్ధం చేశారు. మరోవైపు పండుగ రోజు అమ్మవారి పూజకు అవసరమైన సామగ్రి, ఇతర వస్తువుల కొనుగోలుకు సోమవారం మార్కెట్లకు పోటెత్తారు. దీంతో జిల్లాలో ప్రధాన కూడళ్లు, రోడ్లు, పలు షాపులు రద్దీగా మారాయి.

Dussehra Festivities  దసరా సందడి
రద్దీగా పార్వతీపురం ప్రధాన రహదారి

  • పండుగకు జిల్లావాసులు సిద్ధం

  • దుర్గమ్మ పూజలకు ఏర్పాట్లు పూర్తి

  • కిటకిటలాడిన మార్కెట్లు

పార్వతీపురం/పార్వతీపురం టౌన్‌/సాలూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మన్యంలో దసరా సందడి నెలకొంది. మంగళవారం ఘనంగా పండుగను నిర్వహించేందుకు జిల్లా వాసులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాహన పూజలకు సర్వం సిద్ధం చేశారు. మరోవైపు పండుగ రోజు అమ్మవారి పూజకు అవసరమైన సామగ్రి, ఇతర వస్తువుల కొనుగోలుకు సోమవారం మార్కెట్లకు పోటెత్తారు. దీంతో జిల్లాలో ప్రధాన కూడళ్లు, రోడ్లు, పలు షాపులు రద్దీగా మారాయి. పార్వతీపురం పట్టణంలో షాపులన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వస్తువులు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం వివిధ గ్రామాల నుంచి కూడా ప్రజలు జిల్లాకేంద్రానికి తరలిరావడంతో పట్టణ ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. దీంతో ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సాలూరు పట్టణం కూడా రద్దీగా మారింది. లారీ కార్మికులు , పట్టణంతోపాటు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు తమకు అవసరమైన పూజా సామగ్రిని కొనుగోలు చేశారు. పూలు, పండ్లతో పాటు ఇతర పూజా సామగ్రి ధరలు సాధారణ రోజుల కంటే రూ.20 నుంచి రూ.30కు పెంచి విక్రయించారు. ఇదిలా ఉండగా దసరా పండగకు వాహనాలు శుభ్రం చేసుకోవడం ఆనవాయితీ. ఈక్రమంలో సర్వీస్‌ సెంటర్లు వాహనదారులతో కిటకిటలాడాయి. ఇకపోతే జిల్లా వ్యాప్తంగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. మహర్నవమి సందర్భంగా హోమాలు, సారె సమర్పణ, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. పాలకొండ, సాలూరు, పార్వతీపురం పట్టణాల్లోని దుర్గాదేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Updated Date - Oct 19 , 2026 | 11:47 PM